ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంగటేసర్లు, ఎన్టీయారూ - రెండు బస్తాల వడ్లు! - NTR 101 Birth Anniversary - NTR 101 BIRTH ANNIVERSARY

NTR 101 BIRTH ANNIVERSARY: 'వొడ్ల కుప్పని అట్టాగ ఎంతసేపు సూత్తవ్‌. నువ్వు సూత్తే  వొడ్లు ఏమన్నా పెరుగుతయా ఏంది? దేవుడు ఎన్ని పండాలని రాసి పెడితే అన్నే పండుతాయి గదా' అని మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య అప్పటికి ఐదోసారో ఆరోసారో మా నాన్నతో అనడం. నాన్న మాత్రం గుండె పగిలిన మనిషిలా ఆ వడ్లని అలా చూస్తూనే ఉన్నాడు. - మేకల అమరబాబు

Special Story on NTR 101 Birth Anniversary
Special Story on NTR 101 Birth Anniversary (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 8:30 AM IST

Updated : May 28, 2024, 11:54 AM IST

ఉమ్మడి గుంటూరు జిల్లా
చల్లగుండ్ల గ్రామం
1982వ సంవత్సరం
NTR 101 BIRTH ANNIVERSARY :'వొడ్ల కుప్పని అట్టాగ ఎంతసేపు సూత్తవ్‌. నువ్వు సూత్తే వొడ్లు ఏమన్నా పెరుగుతయా ఏంది? దేవుడు ఎన్ని పండాలని రాసి పెడితే అన్నే పండుతాయి గదా' అని మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య అప్పటికి ఐదోసారో ఆరోసారో మా నాన్నతో అనడం. నాన్న మాత్రం గుండె పగిలిన మనిషిలా ఆ వడ్లని అలా చూస్తూనే ఉన్నాడు.

నాన్న బాధకు బలమైన కారణం లేకపోలేదు. ప్రతి ఏడాదీ చేలో కల్లం కొట్టి వడ్లను ఎద్దుల బండ్లపై జల్లల్లో పోసుకుని ఇంటికి చేర్చి ఆరు బయట పట్టలపై పోసి నాలుగైదు రోజులు ఎండకు ఆరబెట్టి, కుప్పగా చేసినప్పుడు చూడాలి. నాన్న ముఖం దీపాల పండగ నాటి మతాబులా వెలిగిపోయేది. ఇంటిల్లిపాదీ పడిన కష్టానికి తగ్గట్లుగా వడ్లు పండాయని సంబరపడేవాడు. పనోళ్లకు అడిగిన దానికంటే రెండు మూడు మానికలు ఎక్కువ వడ్లు ఇచ్చేవాడు. (మానిక అంటే కొలిచే పాత్ర. అప్పట్లో ఒక బస్తా అంటే కొలతకు 54 మానికలు తూకానికి 76 కిలోలు). ఆ ఏడాది పంటకు తెగుళ్లు సోకి చేను చాలా తక్కువ పండింది. అందుకని నాన్న కుశాలగా లేడు. పెట్టిన పెట్టుబడి పోను మిగిలిన గింజలు ఏడాదంతా తిండికి సరిపోతాయా అని బాధపడుతున్నాడు.

'తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్'- చంద్రబాబు సహా ప్రముఖుల ఘన నివాళి - Chandrababu Pays Tributes to NTR

ఆ రోజు వడ్లను గోతాల్లోకి ఎత్తబోతుండగా ఎలుకల బుట్టల ఎల్లన్న వచ్చాడు. చేలో వరి దుబ్బుల్ని ఎలుకలు కొట్టకుండా, గట్ల దగ్గర బుట్టలు పెట్టి, వాటిని పట్టి, పంటను కాపాడాడాయన. అందుకు వడ్లు ఇస్తామని నాన్న వాళ్లు ఒప్పుకొన్నారు. ఆ రోజుల్లో డబ్బులు చాలా తక్కువ ఉండేవి. ప్రతి పనికీ వడ్లనే ఇచ్చేవారు. ఎల్లన్న గోతం తెరిచి పట్టుకుంటే నాన్న మానికతో వడ్లను పోస్తున్నాడు. అలా ఎనిమిది మానికలు కొలిచి ఆపేశాడు. 'అదేంది ఎంగటేసర్లు గోరూ పది మానికలు కదా అనుకుంది. ఎనిమిదే పోశారేంది?' అని ఎల్లన్న అడిగాడు. 'ఈసారి పెద్దగా పండలేదు లేరా ముందటేడుకు ఎక్కువ కొలుత్తాలే' అని నాన్న చెప్పాడు. 'ముందనుకున్నట్టు కొలవాల్సిందే మీలాగే మిగతా వాళ్లూ తగ్గిత్తే నా పొట్ట గడిచేదెట్టా' అని ఎల్లన్న దీనంగా అన్నాడు. 'పనోళ్లకు తగ్గించి మిగిలిచ్చిన వొడ్లు తిన్నా మనకు వొంటబట్టవు లేరా. వాడికి మొత్తం కొలిచి ఇచ్చెయ్యి' అని తాతయ్య అనడంతో నాన్న అయిష్టంగానే మిగతా రెండు మానికల వడ్లనూ గోతంలో పోశాడు.

కాలువ నీటిని చేనికి రెండు తడులు ఎక్కువ పెట్టుకోనిచ్చిన లస్కరు సుబ్బయ్య, ఏడాదంతా క్షవరాలు, గడ్డాలు చేసిన నారాయణ, బట్టలు ఉతికిన గోవిందు, ఇంట్లో చిన్నోళ్లకు, పెద్దోళ్లకు చెప్పులు కుట్టిన యాకోబు, శుభకార్యాలకు అవసరమైన కుండలు ఇచ్చిన మల్లన్న, బర్రెలు దున్నల్ని మేపిన దావీదు, కర్రకు ముల్లు పెట్టడం నుంచి నాగలి చేయడం వరకూ చక్కబెట్టిన సూర్యనారాయణ ఇలా అందరూ గోతాలు తీసుకుని ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎలాంటి తగ్గింపులూ లేకుండా వాళ్లకు నాన్న వడ్లు కొలిచాడు. జ్వరాలూ, రోగాలూ, రొష్టులూ వస్తే ఇంటికొచ్చి చూసి, బిళ్లలు రాసిచ్చి మా ఆరోగ్యాన్ని కాపాడిన ఆర్‌ఎంపీ డాక్టరు గారు పంపిన మనిషి చివర్లో వచ్చాడు. అందరికంటే ఎక్కువగా ఆయనకు 25 మానికల వడ్లు ఇచ్చి పంపాడు నాన్న.

మిగిలిన ధాన్యాన్ని గోతాల్లోకి ఎత్తి, మూతులను కుట్టి ఆ బస్తాల్ని ఇంటి పంచలోకి చేరుస్తుండగా చాటింపు కోటన్న తప్పెట శబ్దం మాకు దగ్గరవుతూ వస్తోంది. 'ఇందుమూలంగా అందరికీ జెప్పేదేందంటే ఎంటీ రామారావు గోరు తెలుగుదేశం పారిటీ బెట్టారంట. మనూరోల్లం గూడా ఆ పారిటీలో జేరాలని, పారిటీ జెండా కోసం నాలుగడుగుల ఎత్తున దిమ్మెను కట్టాలని, జెండా కట్టడానికి 40 అడుగుల పేద్ద ఇనప కడ్డీని కొనాలని పెద్దోల్లంతా అనుకుంటున్నారు. పారిటీ మీటింగులకు పోవడానికి డబ్బులు పోగుచేసుకోవాలంట. అందుకని ఎవురికి తోచినంత వారు డబ్బులుగానీ వొడ్లుగానీ ఇయ్యాలంట. ఈ రోజు మాపటేల ఇద్దరు మడుసులు ఈ బజారుకొచ్చి వసూలు జేత్తారహో' అని కోటన్న గుక్క తిప్పుకోకుండా చాటింపేసి మళ్లీ తప్పెట వాయించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

ఈ రికార్డ్​ ఎన్టీఆర్‌కే సాధ్యం? - అంతమంది దర్శకులతో పనిచేశారా? - NTR 101 Birth Anniversary

ఎన్టీఆర్‌ ఈ పేరు వింటేనే ఏదో కొత్త బలం వచ్చినట్లు కనిపించేవాడు నాన్న. ఎప్పుడన్నా పేటకో, గుంటూరుకో పోయినప్పుడు హాల్లో ఎంతో కుశాలగా సినిమాలు చూసేవాడు. పండక్కో పబ్బానికో ఊళ్లో బొడ్డురాయి కాడో, పంచాయతీ ఆఫీసు దగ్గరో తెర కట్టి ప్రొజెక్టర్‌ పెట్టి వేసే ఎన్టీఆర్‌ సినిమాల్ని చూసేటప్పడు చాలా ముందుగానే వెళ్లి ముందు వరుసలో కూర్చునేవాడు.

దేశమ్ము మారిందోయ్‌. కాలమ్ము మారిందోయ్‌. కష్టాలు తీరేనోయ్‌. సుఖాలు నీవేనోయ్‌.

'రాముడు-భీముడు' సినిమాలోని ఈ పాటంటే నాన్నకు ప్రాణం. తరచూ పాడుతుంటాడు కూడా. ఆ పాట రేడియోలో వస్తోందంటే పనులన్నీ ఆపేసి అయిపోయేదాకా వినాల్సిందే. నాన్నకు ఎంతో ఇష్టమైన రెండు సంగతులు అందులో ఉన్నాయి మరి. అందులో ఎన్టీఆర్‌ ఆడిపాడటం ఒక సంగతైతే బ్యాక్‌గ్రౌండ్‌లో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు సాగుతుండటం మరొక సంగతి. పల్నాడులోని మా ఊరి మెట్ట, బీడు పొలాల్ని బంగారు మాగాణిలా మార్చింది. నాగార్జునసాగర్‌ కుడి కాలువ నీరే. నాన్న చదువుకోలేదు. అయినా ఎంతో కష్టమైన ఎన్టీఆర్‌ డైలాగుల్ని, కొన్ని సినిమాల్లో ఆయన పాడిన పద్యాలను తప్పుల్లేకుండా కంఠతా అప్పగించేసే వాడు.

అంతకుముందు రాజకీయాలంటే మా బజారులో ఎవరూ పెద్దగా పట్టించుకునే వారే కాదు. మా బజారుకు పెద్ద మనిషిగా ఉండే కోటిలింగం ఎవరి పేరు చెబితే వారికే జై కొట్టేవాళ్లు. కోటిలింగం పంపించాడంటూ గోతం తీసుకుని ఇద్దరు మనుషులు ఆ రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చారు. నాన్న ఎన్ని మానికల వడ్లు కొలుస్తాడా అని అందరం చూస్తూ ఉన్నాం. వచ్చిన ఇద్దరికీ చెరో బస్తా వడ్లు ఎత్తి పంపించాడు నాన్న. అది చూసి అమ్మ, నాయనమ్మ, తాతయ్యలకు నోట మాట రాలేదు. 'అదేందిరా రెండు బత్తాలు ఇచ్చినవ్‌. 20 మానికలు ఇత్తే పొయ్యేదిగా. ఎన్టీయారంటే నీకు ఇట్టం కాబట్టి మహా అయితే ఇంకో పది మానికలు ఎక్కువ కొలవాల్సింది. అట్టా గాకుండా ఒక్కపాలే రెండు బత్తాలిత్తే ఎట్టా? తిండి సరుకులు అప్పిచ్చిన కోమటాయనకు, పురుగుల మందులు, ఎరువులు ఇచ్చిన మందుల కొట్టాయనకు ఇంకా వొడ్లు కొలవాలి. ఉన్నయి సరిపోతయ్యో లేదో! ఇంత కటకటలాడతన్నప్పుడు నువ్వు ఒక్కపాలే రెండు బత్తాలిచ్చినవేంది?' అని తాతయ్య అడిగాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. 'ఏందయ్యోయ్‌ సాచ్చాత్తూ ఎంటీ రామారావే సరాసరి మనూరుకు వచ్చి ఎంగటేసర్లూ నువ్వు ఇత్తేనే గానీ నా పారిటీ నడిచేటట్టు లేదు. అని నిన్నేదో అడిగినట్లు రెండు బత్తాలిచ్చినవ్‌' అని అమ్మ నిష్టూరమాడినా నాన్న నవ్వుతూ నిలబడ్డాడే తప్ప బదులివ్వలేదు. ఆయన ముఖం చూసి ఏమీ అనలేక అందరూ మిన్నకుండిపోయారు. వెంకటేశ్వర్లు రెండు బస్తాలిచ్చిండంట అని బజారు మొత్తం ఉలిక్కిపడింది. 'ఎంగటేసర్లు ఎచ్చులు పోతున్నాడు' అని కొందరంటే. 'ఎంటీయారంటే ఇట్టం కదా అందుకే ఇచ్చుంటాడు' అని మరికొందరన్నారు.

మరుసటి రోజు ఉదయాన్నే కోటిలింగం తనతో పాటు ఇద్దరిని వెంట బెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. ఆయనతో వచ్చిన ఇద్దరిలో ఒకరి తలపై బస్తా, ఇంకొకరి తలపై అరబస్తా వడ్లు ఉన్నాయి. వారిద్దరూ మా ఇంటి పంచలో ఆ వడ్లను దించారు. 'ఏంది ఎంగటేసర్లూ రెండు బత్తాల వొడ్లను సరదాగా ఇచ్చేంత మొగోడివా నువ్వు. తిక్కలోడా అందరికంటే ముందుండి పారిటీలో తిరగాలనుకుంటున్న నేనే. నాకు ఉన్నంతలో అర బత్తా ఇచ్చా. నీ దగ్గర రెండు బత్తాల వొడ్లు తీసుకుంటే నా పరువేంగావాల. వూళ్లో వాళ్లంతా ఎవురి తాహతుకు తగ్గట్లు వారు. 10 మానికలో, 20 మానికలో కొలిసినోళ్లే కానీ నీలాగ రెండు బత్తాలిచ్చినోళ్లు లేరురా నాయనా. అందుకే అరబత్తా ఉంచుకుని, మిగతావి ఇచ్చేద్దామని వచ్చా' అని చెప్పేసి కోటిలింగం వెళ్లిపోయాడు. ఆ బస్తాన్నర వడ్లను చూసి మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య హమ్మయ్య అని నిట్టూరిస్తే తాను ఇచ్చిన చందా తిరిగి వచ్చినందుకు మా నాన్న ముఖం మాత్రం చిన్నబోయింది.

Last Updated : May 28, 2024, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details