Ganga Destroyed By Eagle Force in Alluri Sitaramaraju District: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా విభాగంగా ''ఈగల్'' బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా గంజాయి సాగును అరికట్టేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో తాజాగా ఈగల్ బృందం చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా దాదాపు 8 ఎకరాల గంజాయి సాగును పోలీసుల సహకారంతో ఈగల్ బృందం దగ్ధం చేసింది.
ఎనిమిది ఎకరాల గంజాయి ధ్వంసం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్, కృత్రిమ మేధ పరిజ్ఞానంతో 2 వేల ఎకరాలు గల గంజాయి పంటను పోలీసులు పరిశీలించారు. పెదబయలు మండలం పాతపాడు గ్రామంలో 8 ఎకరాల గంజాయి సాగును ఈగల్ బృందం, పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. పాతపాడు గ్రామస్థులతో ప్రత్యామ్నాయ పంటలను వేయించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
అందుకుగాను గ్రామస్థులకు రాజ్మ, కింగ్ బీన్స్, మిల్లెట్ వంటి పంటలు వేసేందుకు సాయం చేయనున్నారు. గంజాయిని నివారించడానికి ప్రజలందరూ సహకరించాలని వారిని కోరారు. వారితో కలిసి గంజాయి సాగుకు నిప్పు అంటించారు. ప్రజలకు హానీ చేకూర్చే ఈ సాగును చేయబోమని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే 1972 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ కోరారు. గంజాయిని దహనం చేసిన అనంతరం ఐజీ రవికృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు.
"గంజాయి అనేది ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. గంజాయి నిర్మూలనకు అందరూ ముందుకు రావాలి. మత్తు పదార్ధాలు యువతను తప్పు దారి పట్టిస్తున్నాయి. మీకు తెలిసి ఎవరైనా మత్తు పదార్దాలకు బానిసలైతే వెంటనే మాకు సమాచారం అందించాలి." -రవికృష్ణ, ఈగల్ విభాగాధిపతి
రాష్ట్రంలో గంజాయి సాగుకు వ్యతిరేకంగా ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్)ను ఏర్పాటు చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో దీని కేంద్ర కార్యాలయం ఉంది. అంతేకాకుండా జిల్లాల్లో సైతం వీటికి సంబంధిత యూనిట్ కార్యాలయాలున్నాయి. అమరావతిలో దీని నార్కోటిక్ పోలీస్స్టేషన్, 26 జిల్లాల్లో వీటికి జిల్లా నార్కోటిక్ విభాగాలున్నాయి.
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం