ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలోనూ శబరిమల ఆలయం - చూసొద్దాం పదండి

కాకినాడ జిల్లాలో ఆంధ్రాశబరిమల అయ్యప్పస్వామి ఆలయం

Andhra Sabarimala Temple
Andhra Sabarimala Temple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Andhra Sabarimala Temple : అయ్యప్ప స్వామి ఆలయం అనగానే మనకు కేరళలోని శబరిమల స్పురణకు వస్తోంది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఆ క్షేత్రం విరాజిల్లుతోంది. దేశం నలుమూలల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిమల క్షేత్రం మార్మోగుతోంది. అలాంటి శబరిమల ఏపీలో కూడా ఉంది. మరి అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కాకినాడ జిల్లాలో ఉన్న ఓ అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్రాశబరిమలగా ప్రసిద్ధి గాంచింది. రోజూ అయ్యప్ప శరణుఘోషతో శంఖవరం మండలం సిద్ధివారిపాలెంలోని దేవాలయంలోని మార్మోగుతుంది. అయ్యప్ప భక్తుల రాకతో కళకళలాడుతోంది. మన్యంలో కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకంగానూ ఆకట్టుకుంటోంది. మరి ఆ విశేషాల గురించి మనమూ తెలుసుకుందామా?

ఆలయ విశిష్ఠతలు ఇవి :కేరళ అయ్యప్ప స్వామి దేవాలయం నమూనాలోనే ఇది ఉండడం విశేషం. ముఖ్యంగా 18 కొండల నడుమ అయ్యప్ప స్వామి ఆలయం ఉన్న చరిత్ర ఆధారంగా ఇక్కడ కూడా ఆంధ్రాశబరిమల దేవాలయాన్ని 2009లో నిర్మాణాన్ని ప్రారంభించి 2011లో పూర్తిచేశారు. ఉపాలయాలు కన్నెముల గణపతి, మాళీగైపురతమ్మ ఆలయం, శరణగుత్తి, స్వామి వారి కోనేరు, నడక మార్గం, పడిమెట్లు ఇవన్నీ కేరళ గుడిని పోలి ఉంటాయి. దీంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం దర్శనానికి వస్తుంటారు. అయ్యప్పమాల వేసుకుని కేరళ వెళ్లలేని మాలధారులు ఆంధ్రాశబరిమల చేరుకుని పడిమెట్ల ద్వారా అయ్యప్పను దర్శించి ఇరుముడులు సమర్పిస్తారు.

సంవత్సరం పొడవునా దర్శనం : అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించే నిత్య పూజలు పంచామృతాభిషేకాలు, పడిమెట్లకు పూజలతో పాటు ఏటా నిర్వహించే విషు పండుగ, మకరజ్యోతి దర్శనం, జన్మనక్షత్రమైన ఉత్తరనక్షత్ర పూజలు చేస్తారు. ఏడాది పొడవునా స్వామి భక్తులకు దర్శనమిస్తారు.

రవాణా సౌకర్యమిలా :ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. బస్సులలో వచ్చే భక్తులు మాలధారులు అన్నవరం/కత్తిపూడి నుంచి ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. మెరుగైన రహదారి సౌకర్యం అవసరం. అదేవిధంగా వసతి కోసం కాటేజీలు ఏర్పాటుచేస్తే ఏపీ నలుమూలల నుంచి మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే వీలుంది. పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది.

18 కొండల నడుమ :అయ్యప్ప భక్తుడు కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామికి స్వామి ఒకరోజు కలలో కనిపించి దేవాలయం నిర్మించాలని చెప్పారట. దీంతో తన జన్మస్థలం శంఖవరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 18 కొండల నడుమ ఆలయాన్ని నిర్మించానంటారు శ్రీనివాసరావు.

ఇలా చేస్తే సులభంగా అయ్యప్ప దర్శనం - ప్రత్యేక పోర్టల్​

అయ్యప్ప కొండకు వెళ్దామా! - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా 62 రైళ్లు

ABOUT THE AUTHOR

...view details