Cabinet Approves One Nation One Election Bill : 'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.
ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లను సంప్రదించేందుకు కూడా ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఈ సమావేశాల్లోనే బిల్లు తెచ్చేందుకు ప్లాన్
పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన నివేదికకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే పచ్చజెండా ఊపింది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జమిలి బిల్లుకు ఆమోదం తెలిపింది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికల నిర్వహించాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 82ఏ, 83(2), ఆర్టికల్ 327 వంటి పలు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుంది. అలాగే జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటేేతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు అందుకు అంగీకరించాలి.
'ఇదొక ముఖ్యమైన అడుగు'
మరోవైపు జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ సహా పలువురు విపక్ష నేతలు స్పందించారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశకు ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.
"జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలి ఎన్నికల కమిటీకి నాయకత్వం వహించినందుకు, పలు రాజకీయ పార్టీలను సంప్రదించినందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అభినందిస్తున్నాను. ఇది మన ప్రజాస్వామ్యాన్ని రూపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు." అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.
'అలా చేయడం వల్ల ప్రజాధనం వృథా కాదు'
అలాగే జమిలి ఎన్నికలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతు తెలిపారు. దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం, ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. తరచుగా జరిగే ఎన్నికలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు.
'అభివృద్ధి ఆగిపోతుంది'
ఒడిశాలో జరిగినట్లే దేశం మొత్తం ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగాలని అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ అభిప్రాయపడ్డారు. లేదంటే అభివృద్ధి పనులు ఆగిపోతాయని తెలిపారు. జమిలి ఎన్నికలకు సంపూర్ణ మద్దతును ఆయన ప్రకటించారు.
'చర్చ జరగాలి'
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చలు జరగాలని బీజేడీ ఎంపీ సంసిత్ పాత్ర అభిప్రాయపడ్డారు. మెజారిటీ పడిపోవడం, హంగ్ అసెంబ్లీ, ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోవడం వంటి జరిగితే ఏమి జరుగుతుంది? వంటి అనేక విషయాలపై చర్చలు జరగాలని ఆయన కోరారు. అలాగే, కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదముద్ర వేసినట్లు తమకు తెలియజేసిందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్, ఇతర విషయాలపై తెలియాలని అన్నారు.
'నాలుగు రాష్ట్రాల ఎన్నికలే నిర్వహించలేకపోయారు'
కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించలేకపోయిందని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాంటిది 31 రాష్ట్రాల అసెంబ్లీ, 545 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తామని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అదానీ, మణిపుర్ సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటివి తీసుకొస్తున్నారని విమర్శించారు.