SP Warning To Man Not Taking Care of His Father in Guntur District :నాన్నపై మరోసారి చేయి చేసుకుంటే కేసు పెట్టి లోపలేస్తాం జాగ్రత్త, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అమ్మానాన్నలను చూసుకునే తీరు ఇదా? అంటూ ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను పోషించటం కుమారుల కనీస బాధ్యత అని గుర్తుచేశారు. యడ్లపాడు దిగువ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు ఎడ్లూరి వెంకట్రావు, ఆయన కుమారుడు నాగరాజు మధ్య పదేళ్లుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. కుమారుడి దురుసు ప్రవర్తనపై తండ్రి పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేయడం పాటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఎస్పీనే బుధవారం వెంకట్రావు ఇంటికి వెళ్లి సమస్య తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తనతో పాటు భార్య, కుమారుడు, కోడలు, మనుమలు ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. చెడు మార్గంలో వెళుతున్న కుమారుడిని పలుసార్లు హెచ్చరించినా తీరు మారలేదన్నారు. అతని కారణంగానే గతంలో అప్పులు చేసినట్లు చెప్పాడు. అప్పుల విషయంలో తనకు, కుమారుడికి మనస్పర్థలు పెరిగినట్లు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు కుమారుడు తిండి పెట్టలేదన్నారు. విసిగిపోయిన తాను కుమారుడిని ఇల్లు విడిచి పోవాలని కోప్పడటంతో కుమారుడు తనను కొట్టినట్లు ఆ తండ్రి చెప్పాడు.