Kanuma Festival Significance 2025 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారు. మూడు రోజుల సంక్రాంతి పండగలో చివరి రోజు కనుమ. మొదటి రోజు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, రెండవ రోజు సిరిసంపదలను అందించే సంక్రాంతి. కనుమను ప్రధానంగా పశువుల పండుగగా చూస్తారు. సంవత్సరం మొత్తం రైతులకు సహాయపడే పశువులను ఈ రోజు పూజించి, వాటిని అందంగా అలంకరిస్తారు. ఇలా మూడు రోజుల సంక్రాంతి పండుగలో ఒక్కోరోజుకు ఒక్కో పరమార్థం దాగి ఉంది. ఈ సందర్భంగా కనుమ పండుగ పరమార్థం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పశువుల పండుగ :
కనుమ నాడు అందరూ వేకువ జామునే తప్పకుండా తలంటు స్నానం చేస్తారు. ఎందుకంటే కనుమ రోజున కాకి కూడా మునుగుతుందట! ఈ రోజున కర్షకులందరూ పాడి పంటలను, పశుసంపదను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయంగా వస్తోంది. అలాగే రైతులు వ్యవసాయ పనిముట్లనూ పూజిస్తారు. రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని శుభ్రంగా కడిగి అలంకరిస్తారు.
పశువుల కొమ్ములకు రంగులు వేసి, వాటి మెడలో రంగురంగుల పూసలు, గంటలు కడతారు. పశువులకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి సంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. ఈ రోజున కుటుంబంలోని పెద్దలను తలచుకుంటారు. ఇలా వ్యక్తులు, పశువులు, పనిముట్లను పూజించడంలో ఓ పరమార్థం దాగి ఉంది. అదేంటంటే మనకు మేలు చేసే వారిని మర్చిపోకూడదు అని కనుమ తెలియజేస్తుంది. అయితే, సొంతూళ్లకు వచ్చిన వారు కనుమ రోజు ఊరి పొలిమేరలు దాటకూడదన్న సంప్రదాయం అనాదిగా వస్తోంది. అందుకే పండక్కి ఊరెళ్ళిన వారు ఈ రోజు తిరుగు ప్రయాణం చేయరు.
ఆనందాన్ని పంచుతూ!
సంక్రాంతి వేళ రైతుల గాదెలన్నీ కొత్తగా వచ్చిన ధాన్యం, ఇతర పంటలతో నిండిపోతాయి. ఈ ఆనంద సమయంలో కుటుంబ సభ్యులకే కాదు, ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా కొత్త బట్టలు తేవడం ఆనవాయితీ! ఈ క్రమంలో పండగ సమయంలో తప్పనిసరిగా దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతుంటారు. పండగ హడావిడి మొదలుకాగానే హరిదాసు, గంగిరెద్దులవారు ఇలా చాలా మంది వచ్చి దానధర్మాలు తీసుకొని వెళ్తుంటారు. పండిన పంటను పూర్తిగా మనమే వినియోగించుకోకుండా, అందులోంచి ఇతరులకు కూడా దానం చేయాలని సంక్రాంతి పండగలో పరమార్థం దాగి ఉంది.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
రైతుల పండుగ - పాడి పశువులను దైవంగా పూజించే కనుమ విశిష్టత ఇదే!
కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు? 'కాకులు కూడా కదలని పండుగ' కథ ఇదీ!