Kanuma Festival Celebrations in State : రైతు కుటుంబాల్లో పశుసంపద ఎంతో అనుబంధంతో కూడుకున్నది. కనుమ పండుగ రోజున పశువులకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పశువులను శుభ్రంగా కడిగి, వాటి నుదుటన బొట్టుపెట్టి, కాళ్లకి, వీపుపై భాగంలో పసుపు కుంకుమతో అలంకరించి పూజలు చేస్తారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పండితులు చెబుతారు.
కనుమ సందర్భంగా గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలోని గోశాలలో జడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో గోపూజ అత్యంత శాస్తోక్తంగా నిర్వహించారు. హిందూ ధర్మ ప్రతీక ఆరాధించే గోమాత విశిష్టతను వివరించేలా ఈ కార్యక్రమం జరిపారు. పాడిపంటలతో రైతుల జీవితాలు కళకళలాడాలని పాలిచ్చే గోవులకు, పనిచేసే బసవన్నలకు, పండించే రైతులకు, ఫలమిచ్చే పొలాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
దేవుళ్ల ఊరేగింపు : కనుమ పండుగను పురస్కరించుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గోపూజ నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అలంకార మండపం నుంచి శ్రీ సోమస్కంద మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారికి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయానికి సమీపంలోని 23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కైలాసగిరి చుట్టూ దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు జరిగింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా కిక్కిరిసిన దేవాలయాలు - శ్రీశైలంలో పెరిగిన రద్దీ
రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు, ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆదిదంపతులు కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని దేవతామూర్తులకు అడుగడుగునా హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గోవుల పండుగ ఘనంగా జరిగింది. పట్టణంలోని దేశవానిపేట వీధిలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు రైతులతో కలిసి గోవుకు పూజలు చేశారు.
కనుమ పండుగ సందర్భంగా కడప మరియాపురం చర్చి ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. బండలాగుడు పోటీలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. పోటీల్లో పలు ప్రాంతాలకు చెందిన ఎద్దులు పాల్గొన్నాయి.
గోవులకు ప్రత్యేక పూజలు : విశాఖ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలను పరిశుభ్రం చేసి గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. పిండి వంటలు వండి పశువులకు తినిపించారు. భక్తులు గోశాలకు చేరుకొని ఆవులను పసుపు-కుంకుమలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో దేశీయ జాతి ఆవులను సంరక్షిస్తున్నారు. ఏటా కనుమ రోజున గోవులకు విశిష్ఠ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి శోభ - అలరించిన గుండురాయి పోటీలు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జగ్గయ్యపేట పట్టణంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీరాం సుబ్బారావు, షరాబు వర్తక సంఘం అధ్యక్షులు శ్రీరాం రామకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నూకల కుమార్ రాజా, తుమ్మేపల్లి నరేంద్ర, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, భరతనాట్యం, గంగిరెద్దుల నృత్యాలతో ఆనందంగా జరిపారు. అనంతరం స్టేజ్‌పై ప్రదర్శించిన వారికి పెద్దలు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య కర్ర సాము చేసి అందరిని అలరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆటపాటలతో అలరించిన సంక్రాంతి సంబరాలు
కత్తులు దూసిన కోళ్లు- కోట్లలో బెట్టింగ్‌లు- సంక్రాంతి సందడి అంతా బరుల్లోనే