Southwest Monsoon Caused Heavy Rains Across the State:ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకల్లో వరద ప్రవాహం పోటెత్తింది. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుండపోత వానకు మొక్కజొన్న, పత్తి, కూరగాయల రైతులకు నష్టం వాటిల్లింది.
Anantapur District:అనంతపురంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపించాయి. భారీ వర్షానికి వేదవతి, హగరి నదులతో పాటు వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద హెచ్ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. హెచ్ఎల్సీ అండర్ టన్నెల్ ఛానల్‌కు రంధ్రం పడి వరద నీరు వంకలోకి చేరుతోంది. కనేకల్ మండలంలో సొల్లాపురం, ఎన్.హనుమాపురం, హనకనహాల్ వద్ద వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
వేదావతి, హగరి ఉద్ధృతితో కనేకల్-ఉరవకొండ మధ్య రాకపోకలు స్తంభించాయి. డి.హీరేహాల్ మండలం హోసగుడ్డం వద్ద పెద్దవంక, సోమలాపురం వద్ద గంగమ్మ వంక ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయదుర్గం-బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిలో రాకపోకలు ఆగిపోయాయి. బొమ్మనహాల్ మండలంలో పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బెలుగుప్ప మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. బూదగవి వంక వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Kurnool District:కర్నూలు జిల్లాలో కర్నూలుతో పాటు ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ, మంత్రాలయంలో వర్షం కురిసింది. హాలహర్వి మండలం బాపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగడంతో ఆంధ్రా, కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచాయి. ఉల్చాలలో కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి.