Man Killed Father in Law for Property : అతడో ఇల్లరికం అల్లుడు. తన మామ పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకోవాలన్న దుర్భుద్ధి పుట్టింది. అతడి దుర్భుద్ధి ఆలోచనలకు అత్త సైతం సహకరించింది. ఆమెతో కలిసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్మీర్‌గల్లీకి చెందిన క్యామొళ్ల శంకర్ (50) మేకల కాపరి. అతనికి భార్య చిన్నమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. పెద్దల్లుడు రవి ఇల్లరికంగా అత్తగారింట్లోనే ఉంటున్నాడు. శంకర్‌కు ఇంటితో పాటు మరో ఖాళీ జాగా, జీవాలు ఉన్నాయి. వీటి కోసం రవి శనివారం రాత్రి మామతో గొడవపడ్డాడు. తర్వాత అత్త చిన్నమ్మతో చర్చించి, మామను అంతమొందించాలనుకున్నాడు.
మేకల కొట్టంలో నిద్రిస్తున్న శంకర్‌ను ప్రణాళిక ప్రకారం అర్ధరాత్రి వేళ రవి, చిన్నమ్మ కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తీసుకొచ్చి, సహజ మరణంగా అందరినీ నమ్మించారు. పట్టణంలోనే ఉంటున్న రెండో కుమార్తె సవిత తండ్రి మృతి వార్త తెలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో మృతదేహంపై మెడ వద్ద గాట్లు చూసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సీఐ వెంకటనారాయణకు హత్యకు సంబంధించిన ఆధారాలు లభించడంతో రవి, చిన్నమ్మలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితులిద్దరూ హత్య చేసినట్లు అంగీకరించారని తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం : మరోవైపు అప్పుల బాధలు తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. కొండ రాజబాపు (45) అనే కౌలు రైతు అప్పుల బాధలు భరించలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొన్నేళ్ల క్రితం పలిమెల మండలంలో భూమిని కౌలుకు తీసుకొని రాజబాపు పత్తి పంట వేశారు. రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితులతో పంట నష్టపోయారు.