తెలంగాణ

telangana

ETV Bharat / state

లైక్‌ చేసి, షేర్ చేస్తే డబ్బులు రావు - ఎవరైనా చెబితే నమ్మకండి

డబ్బులు ఎవరైనా ఊరికే ఎందుకిస్తారు? - సోషల్ మీడియాలో లైక్, షేర్ చేస్తే రెండువేలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు - నమ్మి మోసపోవద్దంటున్న పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Stock Market Fraud In Hyderabad
Social Media Frauds In Telangana (ETV Bharat)

Social Media Frauds In Telangana : డబ్బులు ఎవరైనా ఊరికే ఎందుకిస్తారు?. లైక్‌ చేయండి, షేర్‌ చేయండి మీ బ్యాంకు ఖాతాలో నగదు వేస్తామని రూ.వెయ్యి, రెండు వేలు ఎర వేసి ఆన్‌లైన్‌ మోసగాళ్లు రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇటువంటి నేరాలు బయటపడుతూనే ఉన్నాయి.

ఆన్‌లైన్‌ మోసాల బారిన పడుతున్నవారిలో అత్యధిక శాతం విద్యావంతులే కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏమీ చదువుకోకపోయినా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి ఓటీపీ చెప్పమంటే అవతల వ్యక్తికి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నవారు ఉన్నారు. కాని విశ్రాంత ఉపాధ్యాయుడు, డాక్టర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు సైబర్‌ మోసాల బాధితుల్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

వీడియో లైక్, షేర్​ల మోసం :రోజు రోజుకు కొత్త తరహా మోసాలతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తగా ఇలాంటి స్కామ్ వెలుగుచూసింది. ఐఎఎస్‌ అనే యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వీడియోలు వస్తుంటాయి. అందులో మన పూర్తి వివరాలు నమోదు చేసి ఉచితంగానే లాగిన్‌ అవ్వవచ్చు. అనంతరం అక్కడ ఉన్న వీడియోలను లైక్, షేర్, సబ్‌స్క్రైబ్‌ చేసిన అనంతరం స్క్రీన్‌ షాట్‌ తీసి అప్‌లోడ్‌ చేస్తే రోజుకు రూ.75 చొప్పున యాప్‌లోని మన వ్యాలెట్‌లో వేస్తామని నేరగాళ్లు ఆశ చూపారు.

అలా జిల్లాలో పలువురు ముందుగా నాలుగు రోజులు ఈ టాస్క్‌ చేయగా అందరికీ రూ.300 వ్యాలెట్‌లోకి వచ్చింది. అనంతరం ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయింది. అనంతరం ఏడాది కాలపరిమితితో ఉన్న రూ.2,100 టాస్క్‌ తీసుకుంటే రోజుకు రూ.75 నగదు వస్తుందని, రూ.5,500 టాస్క్‌తో రోజుకు రూ.200, రూ.18 వేలు టాస్క్‌తో రూ.600 చెల్లిస్తామని యాప్‌ నిర్వాహకులు నమ్మబలికారు.

నగదు వస్తుందనే ఆశతో 14 మంది రూ.18 వేలు టాస్క్‌కు నగదు చెల్లించారు. రోజువారీ వస్తున్న నగదు యాప్‌ వ్యాలెట్‌లో చేరినట్లు చూపేది. దానిని బ్యాంకు ఖాతాకు మార్చుకునే వీలు మాత్రం ఉండేది కాదు. నిలదీస్తే సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని, సరిచేస్తామని సైబర్‌ నేరగాళ్లు మాయమాటలు చెప్పేవారు. రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యాప్‌ పేరిట మోసం :ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పలువురుఇలా వేలల్లో నగదు జమచేసి టాస్క్‌ తీసుకున్నారు. యాప్‌లో వచ్చిన వీడియోలను లైక్, షేర్‌ చేస్తే రూ.లక్షల్లో నగదు వస్తుందని నమ్మి పలువురు మోసపోయారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు, పోలీసు సిబ్బంది కుటుంబీకులు కూడా ఉన్నారు.

ఎలా ఫిర్యాదు చేయాలి :నష్టపోయిన నగదు రూ.15 వేలు పైన ఉంటే ఆన్‌లైన్‌ మోసం జరిగిన 48 గంటల్లోపు టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. ఐటీ కోర్‌ పోలీసు బృందం స్పందించి బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. నగదు వెనక్కి రప్పిస్తారు. నష్టపోయిన నగదు రూ.15 వేలు లోపే ఉంటే జాతీయ సైబర్‌ నేరాల పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసి వివరాలు ఐటీ కోర్‌ విభాగానికి పంపిస్తారు.

హైదరాబాద్‌లో రూ.10కోట్లు లూటీ చేశారు - నిందితులు బెంగళూరులో దొరికారు

ఈడీ కేసు అంటూ ఫేక్ సీబీఐ ఫోన్ కాల్ - వ్యాపారవేత్త నుంచి రూ.28.50లక్షలు స్వాహా - 28 lakhs Cyber Crime In Name of CBI

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details