Snake Stuck in a Bike In Suryapet District :సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పాము సుమారు అరగంట పాటు ట్రాఫిక్ ఆపేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న రాఘవేంద్ర సూపర్ మార్కెట్‌కు ఓ వ్యక్తి సరుకులు కొనడానికి వచ్చాడు. కాసేపటి తరువాత వేగంగా వచ్చిన ఓ పాము, సూపర్ మార్కెట్ ముందు పార్క్ చేసిన ఆ బైక్‌లోకి దూరింది. ఇది గమనించిన స్థానికులు బైక్ ఓనర్‌కు సమాచారమిచ్చారు. బైక్ ఓనర్, మరికొందరు పామును బయటకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. రాత్రి కావడం, చీకటి వల్ల పాము సరిగా కనిపించలేదు. చివరకు బైక్ సీట్‌తో సహా మొత్తం విప్పిన తరువాత పాము ఒక్కసారిగా బయటకు వచ్చింది.
బైక్ పైనుంచి కిందకు దూకి పాము వేగంగా పారిపోతుండటంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దాని తలపై కొట్టడంతో చనిపోయింది. మొత్తం ఈ ఎపిసోడ్ సుమారు అరగంట పాటు సాగింది. బైక్ సీట్ తొలగించడం, అందరూ సెల్‌ఫోన్ లైట్లతో పాము కోసం చూస్తుండటంతో రోడ్డుపై వెళ్తున్న వారు కూడా గుమిగూడారు. దీంతో ఆ రూట్లో కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. పామును చంపిన తరువాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.