Actor Darshan Bail : రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలుకెళ్లిన కన్నడ నటుడు దర్శన్ కు కాస్త ఊరట లభించింది. ఈ కేసులో దర్శన్ కు వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్ తన పాస్ పోర్టును ట్రయల్ కోర్టు ముందు సరెండర్ చేయాలని షరతు విధించింది. అలాగే దర్శన్ తనకు నచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొందొచ్చని పేర్కొంది. అయితే వారంలోగా దర్శన్ చికిత్స వివరాలు, ఆరోగ్య నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
హైకోర్టును ఆశ్రయించిన దర్శన్
అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దర్శన్ తొలుత సెషన్స్ కోర్టులో సెప్టెంబరు 21న పిటిషన్ దాఖలు చేశారు. వెన్నుముకకు శస్త్ర చికిత్స చేయించుకుంటానని తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బళ్లారి సెంట్రల్ జైలు వైద్యులు, బళ్లారిలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగాధిపతి సమర్పించిన వైద్య నివేదికను హైకోర్టు ధర్మాసనం ముందుంచారు దర్శన్ తరఫున న్యాయవాది సీవీ నగేశ్. ఈ క్రమంలో దర్శన్ తరఫు న్యాయవాది సీవీ నగేశ్, స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ వివరణాత్మక వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా దర్శన్‌కు ఆరు వారాల పాటు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
"దర్శన్‌కు వైద్యం కోసం బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరాం. దర్శన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పత్రాలను న్యాయస్థానానికి సమర్పించాం. దీంతో ఆరువారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. దర్శన్‌కు వైద్యం అందించాల్సి ఉంది. దర్శన్ పాస్ పోర్టును ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మేము షరతులకు లోబడి ఉన్నాం. మాకు కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయి. పాస్ పోర్ట్ ట్రయల్ కోర్టుకు సమర్పిస్తాం. దర్శన్‌కు వెన్నుముక సమస్య ఉంది. ముందు అతను చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాలి. తర్వాత ఒక వారంలోగా వైద్య చికిత్సకు సంబంధించిన నివేదికను సీలు కవరులో కోర్టుకు సమర్పించాలి" అని దర్శన్ తరఫు న్యాయవాది సునీల్ కుమార్ తెలిపారు.
ఇదీ కేసు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ జూన్ 11న అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ను, బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవల బళ్లారి జైలుకు తరలించారు.