తెలంగాణ

telangana

ETV Bharat / state

టెన్షన్ టెన్షన్ - ఇంకా లభించని ఆ 8 మంది ఆచూకీ - SLBC TUNNEL OPERATION UPDATE

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు - ప్రమాద స్థలానికి 50 మీటర్ల దూరం వరకు చేరిన బృందాలు - మట్టి, బురద ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం

‍SLBC Tunnel Rescue Operation
‍SLBC Tunnel Rescue Operation Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 6:59 AM IST

‍SLBC Tunnel Rescue Operation Update :శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు కావొస్తుంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ బృందాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నా, ఫలితం లేకుండాపోతుంది. ఇప్పటికే భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్‌ఫోర్స్‌, విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు మూడు హెలికాప్టర్‌లలో అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు.

టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు :నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెండో రోజు చర్యలు కొనసాగాయి. ప్రమాదం జరిగి 48 గంటలు అవుతున్నా బాధితులను కాపాడటం అత్యంత క్లిష్టంగా మారింది. ఆదివారం వేకువ జాము నుంచే ఎన్డీఆర్ఎఫ్, సైన్యం బృందాలుగా లోనికి వెళ్తూ రక్షణ చర్యలు ప్రారంభించాయి. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్లాయి. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం సమీపంలోకి రక్షణ దళాలు వెళ్లాయి.

ప్రమాద స్థలానికి 50 మీటర్ల దూరంలో:ప్రమాద సమయంలో అక్కడ చిక్కుకుపోయిన వారి పేర్లను పిలుస్తూ సిబ్బంది శబ్దాలు చేశారు. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారన్న ఆశలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు డ్రోన్‌తో పాటు, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో ఎవరైనా ఉన్నారా? అని పరిశీలించారు. 14వ కిలోమీటర్ వద్ద పనులు చేస్తున్న టన్నెల్ బోర్ మిషన్‌ వద్దకు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు, ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కటిక చీకటితో పాటు పెద్ద ఎత్తున బురద ఉండటంతో సాధ్యం కాక తిరిగి బయటకు వచ్చేశారు.

అడుగడుగునా ఆటంకాలు :రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మట్టి, నీరు, విరిగిపడిన సెగ్మెంట్లు అడ్డు తగులుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సొరంగంలోని సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల వరకు బురద, నీళ్లు ఎగదన్నాయని వెల్లడించాయి. ఐదు అత్యాధునిక అశ్వ సామర్థ్యం ఉన్న పంపులను వినియోగిస్తూ, ఆ నీటిని భారీ మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు.

సొరంగం లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రెయిలింగ్, రాడ్లను తొలగించేందుకు కట్టర్లు, వెల్డింగ్ పనులు చేసేందుకు విద్యుత్‌ అవసరం రావటంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. నాగర్‌కర్నూల్‌ సమీపంలో జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లో పనులు చేస్తున్న సుమా సంస్థకు చెందిన భారీ జనరేటర్‌ను తెప్పించి శక్తివంతమైన కాంతి వెదజల్లే లైట్లను సొరంగంలో అమర్చారు. సొరంగంకు అడ్డుపడ్డ ఇనుప కడ్డీలను, పైపులను తొలగిస్తేనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి వీలు ఏర్పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భావిస్తున్నారు.

భారీగా మట్టి, బురద ఉండటంతో :సొరంగంలో చిక్కుకున్న 8 మంది సభ్యులను బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సైన్యం, ఎన్టీఆర్ఎఫ్ దళాలు, నిర్మాణ సంస్థలతో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. భూ ఉపరితలంపై నుంచి లోనికి రంధ్రాలు చేసి వెళ్లడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. సొరంగం లోపలకు చేరుకోవడం అక్కడి నుంచి మట్టి, బురదను వెనక్కు వేగంగా తరలించడంపై సమాలోచనలు చేశారు.

బ్లూ ప్రింట్‌లు, మ్యాప్‌ల ఆధారంగా : సొరంగం ప్రాంతానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌లు, మ్యాప్‌ల ఆధారంగా పరిశీలన చేపట్టారు. భారీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ అర్వింద్‌ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్​లు సైతం అక్కడి పరిస్థితులను సమీక్షించారు. మరోవైపు లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు నిర్మాణ సంస్థ సమాచారాన్ని అందించింది. వారు ఇక్కడకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేసింది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటన - పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం : మంత్రి జూపల్లి కృష్ణారావు

SLBC PROJECT: నిలిచిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు..!

ABOUT THE AUTHOR

...view details