తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్యాంక్​బండ్ చుట్టూ స్కైవాక్‌ - భలేగా ఉంటుంది కదూ! - SKYWALK AROUND HUSSAINSAGAR

హైదరాబాద్ మెట్రో డెవలప్​మెంట్ అథారిటీ కసరత్తు - స్కైవాక్‌తో పాటు మరోవైపు సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు - దాదాపు రూ.500 కోట్ల అంచనా వ్యయం - త్వరలో టెండర్లు పిలిచేందుకు అవకాశం

TELANGANA TOURISM
SKYWALK AROUND HUSSAINSAGAR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 5:28 PM IST

Skywalk Around Hussainsagar in Hyderabad : హైదరాబాద్​లో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌ చుట్టూ స్కైవాక్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందన తెలిపింది. ఇప్పటికే ఈ స్కైవాక్ ప్రాజెక్టుపై హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో చేపట్టాలనేది ప్రభుత్వం ఆలోచన. ప్రాజెక్టు నిర్వహణకు ఆర్థిక వెసులుబాటు (ఫైనాన్షియల్‌ వయబులిటీ)పై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉమ్టా ప్రణాళిక : నిర్వహణ కీలకం కావడంతో ఆదాయం పొందే మార్గాలపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఉమ్టా(యునిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్​పోర్ట్ అథారిటీ) ప్రణాళిక సిద్ధంచేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ చరిత్రను దృష్టిలో ఉంచుకుని స్కైవాక్‌ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. సాధ్యమైనంత వరకు నీటిలో పిల్లర్స్ లేకుండా, గట్టుపై ఉండేలా డిజైన్‌ రూపకల్పన చేస్తున్నారు. స్కైవాక్‌తో పాటు మరోవైపు సైకిల్‌ ట్రాక్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.

ప్రాజెక్టులో పలు కీలకాంశాలు

  • నగరంలో హుస్సేన్‌సాగర్‌లోని నెక్లెస్‌ రోడ్డు, సంజీవయ్య పార్కు, లుంబిని పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్, ట్యాంక్‌బండ్‌ ప్రధాన పర్యాటక ప్రాంతాలలో కీలకంగా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో మరింత మంది పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
  • ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌తో ఈ స్కైవాక్‌ కనెక్టివిటీ ఇవ్వనున్నారు. మైట్రో దిగి నేరుగా స్కైవాక్‌పై నుంచి నడిచి వెళ్లి హుస్సేన్‌సాగర్‌ అందాలను హాయిగా ఆస్వాదించవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్ల నుంచి ఐమాక్స్‌ మీదుగా అటు నెక్లెస్‌ రోడ్డు, ఇటు ఎన్టీఆర్‌ పార్కు నుంచి సాగర్‌ చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నారు.
  • స్కైవాక్ ఆరు మీటర్లు వెడల్పుతో ఏర్పాటు కానుంది. అందులోనే ఒకవైపు సైకిల్‌ ట్రాక్‌, ఇంకో భాగం నడిచే మార్గానికి కేటాయిస్తారు. కీలకమైన మొత్తం 7 ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో లిఫ్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. సైకిళ్లు తొక్కుతూ స్కైవాక్‌ పైకి చేరేలా ర్యాంపులు సైతం ఏర్పాటు కానున్నాయి.

ఆదాయ మార్గం ఇలా :స్కైవాక్‌కు ఆనుకుని ఫుడ్‌కోర్టులు, ఓపెన్‌ థియేటర్లు, గేమింగ్‌ జోన్లు, మినీ థియేటర్లు వంటి వాటిని అందుబాటులోకి తేనున్నారు. స్కైవాక్‌ పైకి వెళ్లిన తర్వాత నడుచుకుంటూ హుస్సేన్‌సాగర్‌ను మొత్తం చుట్టి రావచ్చు. మార్నింగ్ వాకింగ్ కోసం ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు. స్కైవాక్ పైకప్పుపై సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటుచేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు.

ఎంట్రీ ఫీజు కింద పర్యాటకుల నుంచి కొంత మొత్తం వసూలు చేసే యోచన ఉందని ఓ అధికారి తెలిపారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం పలు చోట్ల జోన్లు కేటాయించడం, పార్టీలు, పుట్టిన రోజులు, పెళ్లి వేడుకలు లాంటివి చేసుకునేందుకు లాంజ్‌లు కూడా అందుబాటులోకి తేవడం ద్వారా కూడా ఆదాయం రానుంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్వహణకు ఇబ్బందులు ఏమి ఉండవని భావిస్తున్నారు.

ట్యాంక్​ బండ్​ చుట్టూ స్కైవాక్​, పర్యాటక వలయం ఏర్పాటు : సీఎం రేవంత్

హైదరాబాద్​లో త్వరలోనే మరో స్కైవాక్ - ఆ ప్రాంత వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు!

ABOUT THE AUTHOR

...view details