Sita Rama Lift Irrigation Project Start Soon :చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపించనుంది. ఈ ఎత్తిపోతల ద్వారా కింద ఆయకట్టుకు నీరు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీల టెండర్లకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.2000 కోట్ల విలువైన పనులకు రెండుమూడు రోజుల్లో టెండర్లు పిలువనున్నారని సమాచారం. సీతారామ పనులను ఎనిమిది ప్యాకేజీలుగా విభజించగా వాటిలో మొదట నాలుగు ప్యాకేజీలకు టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తారు.
మిగిలిన 2 వేల కోట్ల పనుల టెండర్లను సైతం త్వరలోనే చేపట్టనున్నారు. ఇన్నాళ్లూ ప్రధాన పనులు పూర్తి కావచ్చినా డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులకు టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. చాలాకాలంగా సంబంధిత ఇంజినీర్లు, నీటిపారుదలశాఖ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా ముందడుగు పడలేదు.
2026 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి : ఇటీవల సీతారామ ఎత్తిపోతల పథకంపై సమీక్షించిన ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016లో చేపట్టారు. మొదట రూ.7,026 కోట్లతో పరిపాలనపరమైన అనుమతి ఇచ్చారు.
కాగా 2018లో రూ.13,057.98 కోట్లతో ప్రభుత్వం సవరించింది. ప్రధాన కాలువ, లిప్టు పనులను 8 ప్యాకేజీలుగా విభజించి చేపట్టగా ఇందులో 95 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఆఖరుకు మిగిలిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపు హౌస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటరీ పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.