Wife Attacks Husband Sister In Nirmal : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడపడుచుపై వదిన బుధవారం మధ్యాహ్నం కత్తితో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో ఆమెకు ముఖం, ఒంటిపై తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు యువతిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని సాయి మాధవ్ నగర్ కాలనీలో బ్యాంక్ ఉద్యోగి హన్మంతరావు భార్య అశ్విని, కుమారుడితో అద్దెకు ఉంటున్నారు. ఇటీవలె అశ్వినికి కూతురు జన్మించింది. దీంతో ఆమె బైంసాలోని పుట్టింటిలో ఉంటుంది. దీంతో తమకు వంట చేయడానికి హన్మంతరావు తన చెల్లెలు తనూజను ముథోల్‌కు తీసుకొచ్చుకున్నారు.
సినీ ఫక్కీలో కత్తితో దాడి : బుధవారం హన్మంతరావు కుమారుడితో కలిసి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య అశ్వినీ భైంసాలో తన పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో మూడు నెలల పాపను ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేసి ముథోల్‌కు వచ్చింది. బురఖా ధరించి మధ్యాహ్నం 2గంటల వేళ తమ అద్దె ఇంటికి వచ్చి పార్సిల్ పేరిట తలుపు తట్టింది. ఇంట్లో ఉన్న తనూజ తలుపు తీయడంతో వెంటనే లోపలికి వెళ్లి గడియపెట్టి కత్తితో దాడి చేసింది.
గాయాలపాలైన తనూజ :ఆమె భయంతో అరవడంతో చుట్టు పక్కల వాళ్లు దొంగలు అనుకొని అప్రమత్తమయ్యారు. అప్పటికే తనూజ రక్తస్రావమై పడిపోయింది. స్థానికులు తలుపులు గట్టిగా కొట్టడంతో అశ్విని బయటకు వచ్చి వారిని కత్తితో బెదిరించి పారిపోయింది. స్థానికులు కొంత దూరం వెంబడించి పట్టుకుని బురఖా తీయించడంతో ఆమె అశ్వినిగా తేలడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వదిననే ఆడపడుచు మీద దాడి చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు. వెంటనే తనూజను చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ముఖం, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ మల్లేష్ అక్కడికి చేరుకొని కేసు నమోదుచేసుకొని అశ్వినిని ఠాణాకు తరలించారు.
పెళ్లికి వరకట్నం ఇవ్వాల్సి వస్తోందని : దాడిపై విచారిస్తే అశ్విని పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. అద్దె ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటంతో తనను ఎవరూ గుర్తుపట్టకుండా బురఖా ధరించినట్లు తెలిపినట్లు సమాచారం. ఆడపడుచుకు ఇటీవల పెళ్లి చూపులు అయ్యాయని, ఆమె పెళ్లికి వరకట్నం ఇవ్వాల్సి వస్తోందనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. కాగా, పసికందును తీసుకొచ్చి అశ్వినికి అప్పగించారు. ఇద్దరిని పోలీసులు నిర్మల్ స్వధార్ కేంద్రానికి తరలించారు.
ఇంటి అద్దె విషయంలో గొడవ - యువతిపై కత్తితో దాడి చేసిన హౌస్ ఓనర్
'నా లవ్‌ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు' : పరీక్షలు రాసేందుకు వచ్చిన యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి