Significance of Bathukamma Festival :బతుకమ్మ ఓ పూల పండుగ, ప్రకృతిని ఆరాధ్య దైవంగా కొలిచే గొప్ప పండుగ. అందరి బతుకును, క్షేమాన్ని కోరుకుంటుంది. జీవకోటి మనుగడ ఈ ప్రకృతిపై ఆధారపడి ఉన్నందున్న, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కన్నతల్లిగా భావించి పూలతో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచార-సంప్రదాయం. సమాజం, ఆధునికత, సాంకేతికత మేళవింపుగా దూసుకెళ్తున్న ప్రస్తుత సమయంలో, నేటి యువత బతుకమ్మ వేడుకలపై ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుసుకుందాం.
సమష్టి తత్వం : బతుకమ్మ పండగ సమష్టితత్వానికి మరోరూపం. అప్పటివరకు ఇంటి వరకే పరిమితమైన ఎంతో మంది మహిళలు, అందరూ ఒకచోటికి చేరడంతో కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. మహిళలందరూ ఆప్యాయంగా మాట్లాడుకునేందుకు చక్కటి వేదిక. విద్యాసంస్థల్లోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో యువతులు తమదైన శైలిలో ఆడిపాడుతున్నారు.
విశ్వవ్యాప్తం :తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ వేడుకులు ఇతర రాష్ట్రాలు, దేశాలకూ విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా చారిత్రక వైభవాన్ని చాటేలా బతుకమ్మ వేడుకలు సాగుతున్నాయి. ఈ పండుగ.. సాహిత్యం, నృత్యం, సంగీతం, చిత్రం, శిల్పం కలయికనని పరిశోధకులు చెబుతుంటారు.
ప్రాశస్త్యం వివరిస్తూ : దసరా పండుగకు 13 రోజులు సెలవులు రాగా నేటి యువతరం, మన సంస్కృతిని తెలుసుకోవడానికి చక్కటి సమయం ఇదే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లందరూ సొంత ఊళ్లకు చేరుకుంటారు. కుటుంబమంతా ఒకే చోటుకు చేరుకుంటారు. పండుగ విశిష్టత, ప్రాశస్త్యం, బతుకమ్మ పాటలను ఆలపించే తీరు, ఆడిపాడే విధానాన్ని యువతరానికి పెద్దలు వివరిస్తున్నారు.
ఆటాపాట : బతుకమ్మ పాటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల జానపద పాటలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బతకుమ్మ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా ఆల్బమ్స్ తయారుచేస్తున్నారు. ఆనాటి పాటలను ఆధునికీకరించి రిలీజ్ చేస్తున్నారు. ఇవి నేటి యువతులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. లయబద్ధంగా ఆడిపాడుతున్నారు. దాండియా, కోలాటం నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. వివిధ సందర్భాల్లో బతుకమ్మ పాటల్లోని నూతనత్వం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.