ఇంటర్ బోర్డు ప్రక్షాళన - కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలి : విద్యార్థి సంఘాల ఆందోళన SFI and AISF Protest at Intermediate Board Office : కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయడం సహా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు బైఠాయించినా అధికారులు స్పందించకపోవటంతో పలువురు ఎస్ఎఫ్ఐ శ్రేణులు గేటు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళనల నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మారినా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. అనుమతులు లేని కళాశాలలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. రీ-వెరిఫికేషన్ పేర్లతో కొన్ని కార్పొరేట్ కళాశాలలు రూ.లక్షల ఫీజులను వసూలు చేస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలి. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. అనుమతిలేని కళాశాలలను వెంటనే మూసివేయాలి. రీ వెరిఫికేషన్ పేర్లుతో కొన్ని కార్పొరేట్ కళాశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి." - విద్యార్థి నాయకులు, ఎస్ఎఫ్ఐ
ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి :మరోవైపుఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఎఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీసు స్టేషనక్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఏఐఎస్ఎఫ్ సమాఖ్య నాయకులు కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి మార్పులు జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తింపు లేని జూనియర్ కళాశాలలను రద్దు చేయాలని కోరారు. అనధికార కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇంటర్ మూల్యాంకనంలో ఇష్టారాజ్యం - జవాబులు సరిగ్గా ఉన్నా మార్కులు రాక విద్యార్థుల ఆవేదన - Errors inter evaluations telangana
ఫీజుల నిర్ధారణ లేదు.. హాస్టళ్లకు అనుమతుల్లేవ్.. ఇష్టారాజ్యంగా 'కార్పొరేట్'