తెలంగాణ

telangana

ETV Bharat / state

మాలీవుడ్‌లోనే కాదు 'టాలీవుడ్‌'లోనూ అదే పరిస్థితి? - రెండేళ్ల కిందటే సర్కార్​కు రిపోర్ట్ - SEXUAL ASSAULTS IN TOLLYWOOD - SEXUAL ASSAULTS IN TOLLYWOOD

Sexual Assaults in Tollywood : కేరళలో జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రపరిశ్రమలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ ఇలాంటి ఓ నివేదిక ఉందని, దాన్ని కూడా బయటపెట్టాలన్న డిమాండ్ ఇప్పుడు వ్యక్తమవుతోంది. 2018 అక్టోబరులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో 25 మందితో కమిటీ వేయగా ఇందులో 12 మంది మహిళలు ఉపకమిటీగా ఏర్పడి విస్తృత అధ్యయనం, పరిశీలన, సంప్రదింపుల అనంతరం ఓ నివేదిక రూపొందించింది. మరి ఆ నివేదిక ఏం తేల్చిందంటే?

Sexual Assaults in Tollywood
Sexual Assaults in Tollywood (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 2:16 PM IST

Sexual Assaults in Tollywood :టాలీవుడ్‌లో హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనంలో తెలుగు సినీ, టెలివిజన్‌ పరిశ్రమల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తేలింది. అభద్రతాభావం, లింగవివక్ష కనిపిస్తోందని, నటీమణులు, గీత రచయితలు, జూనియర్‌ ఆర్టిస్టులు ఇలా అన్ని స్థాయుల్లోనూ పురుషాధిక్యత కనిపిస్తోందని వెల్లడైంది. సురక్షిత రవాణా వసతి లేకుండా రాత్రివేళల్లో ఆలస్యమయ్యేలా పనులు చేయిస్తున్నారని 2022 జూన్‌ 1న ప్రభుత్వానికి అందిన నివేదిక ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదు. అయితే ఆ నివేదికలో వెల్లడైన విషయాలు, ఆ కమిటీ చేసిన సిఫార్సులు ఏంటంటే?

నివేదికలో ఏం చెప్పారు..?

  • "సినీ రంగంలో పలువురు మహిళలు వాళ్లు ఎదుర్కొంటున్న వేధింపులపై మాకు ఫిర్యాదులిచ్చారు. ఫిల్మ్ సెట్లు, ఆడిషన్ ఛాంబర్లు, రికార్డింగ్ స్టూడియోలల్లో వారు అవమానాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు రోజువారి కూలి కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందని బాధపడ్డారు. అయితే కొంతమంది కో-ఆర్డినేటర్లు, మధ్యవర్తులపై ఆధారపడుతున్నట్లు మాతో చెప్పగా మేం సినీ కళాకారుల సంఘం ప్రతినిధులతో ఈ విషయంపై మాట్లాడాం. వారేమో తమ సంఘం నమోదుకాని ఆర్టిస్టులు ఇలా కోఆర్డినేటర్లు, మధ్యవర్తులపా ఆధారపడి లైంగిక, శ్రమ దోపిడీకి గురవుతున్నారు వారి చెప్పారు.
  • ఇక సినిమాలు, సీరియళ్లు, షార్ట్ ఫిల్మ్ పేరిట మహిళలను ఆడిషన్స్‌కు పిలుస్తున్నారు. అలా అవకాశం కోసం వచ్చిన వారిని మూసి ఉన్న గదుల్లో ఆడిషన్స్ నిర్వహిస్తూ ఏదైనా జరిగినా ఎటూ వెళ్లేందుకు వీలులేకుండా చేస్తున్నారు. అక్కడ మరే మహిళలూ ఉండటం లేదు. ఇంకా దారుణమేంటంటే ఆడిషన్స్‌ను కనీసం రికార్డు కూడా చేయడం లేదు. మరోవైపు రవాణా సౌకర్యం లేక మహిళా కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఇళ్లకు సురక్షితంగా చేరుకునే వరకు వారికి భయం తప్పడం లేదు. మరోవైపు డ్యాన్స్ స్కూల్స్‌, ఆడిషన్స్లలోనే వేధింపులు మొదలవుతున్నాయి. ఏజెంట్లు, మేనేజర్లే వీటికి బాధ్యులని మాకు ఓ మహిళా జర్నలిస్టు తెలిపారు.
  • ఎవరైనా తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రశ్నిస్తే అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు. కొందరినైతే వారే పరిశ్రమ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. అందుకే చాలా మంది తమ భవిష్యత్ కోసం నోరు విప్పడం లేదు. ఇక సినీ పరిశ్రమకు చెందిన సంఘాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉండటం లేదు. ఇప్పటి వరకు ఉన్న సంఘాల్లో మహిళలలకు చాలా చాలా తక్కువ సభ్యత్వాలున్నాయి. ఇక వీటిలో సభ్యత్వ రుసుం భారీగా ఉండటం గమనార్హం.
  • సినిమా ఇండస్ట్రీలో నిర్ధిష్టమైన వర్కింగ్ అవర్స్ లేవు. ఉదయం 5 గంటలకు వస్తే రాత్రి 10 గంటల వరకూ పనిచేయాల్సి వస్తోంది. ఇక టీవీ ఇండస్ట్రీలో మరీ దారుణం ఉదయం 4 నుంచి రాత్రి 8 వరకు శ్రమిస్తున్నా పనిచేసే చోట మహిళలకు సరైన వసతులుండటం లేదు. వాష్‌రూమ్స్, ఆహారం, రవాణాకు సంబంధించి మహిళా ఆర్టిస్టులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక కొన్ని చోట్ల అయితే మహిళలు తమ దుస్తులు మార్చుకోవడానికి కూడా గది సౌకర్యం కల్పించడం లేదు. వారికి సరైన వేతనాలుండటం లేదు." అని కమిటీ తన రిపోర్టులో వెల్లడించింది.

కమిటీ చేసిన సిఫార్సులు ఇవే

  • "సినీ, టీవీ ఇండస్ట్రీల్లో మహిళలకు భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం, స్త్రీశిశు సంక్షేమం, కార్మిక, పోలీసు శాఖలతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలు చొరవతీసుకుని పని చేయాలి.
  • మహిళా ఆర్టిస్టులు ఫిర్యాదు చేసేందుకు, వారి ఫిర్యాదులపై స్పందించి పరిష్కరించేందుకు పోలీసుశాఖ షీటీమ్‌ల ఆధ్వర్యంలో ఒక హెల్ప్‌లైన్‌ ఉండాలి.
  • వేధింపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపేందుకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇంటర్నల్‌ కమిటీ ఏర్పాటు చేయాలి. పరిశ్రమలోని ప్రతి యూనియన్‌లోనూ ఇలాంటి ఓ కమిటీ తప్పక ఉండాల్సిందే.
  • యూనియన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, వారికి సభ్యత్వం పెరగాలి.
  • ఇండస్ట్రీలో కో-ఆర్డినేటర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలి
  • అందరి సమక్షంలో ఆడిషన్లను నిర్వహించాలి, ఆడిషన్స్‌ను రికార్డు చేయాలి
  • షూటింగ్ స్పాట్స్‌లో టాయ్‌లెట్లు, దుస్తులు మార్చుకునేందుకు మహిళలకు ప్రత్యేక గదులు కేటాయించాలి. షూటింగ్‌ లేటయితే రాత్రి పూట వారికి తప్పకుండా సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలి.
  • సినీ, టీవీ ఇండస్ట్రీల్లో కచ్చితంగా కార్మిక, మహిళా చట్టాలను అమలు చేయాలి".

ABOUT THE AUTHOR

...view details