Several State Roads in Annamayya and YSR Districts Will Be Maintained As National Highways : ప్రజలకు అవగాహన కల్పించి రాష్ట్ర రహదారులకు మోక్షం కల్పించే బాధ్యత తీసుకుంటామని, ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. రహదారులను సుందరంగా తీర్చిదిద్దేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రయాణికులపై పెద్దగా భారం లేకుండా చూసుకుంటామని వివరించాలని, ఇందుకు ప్రజలను ఒప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలందరూ సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసే జిల్లాల్లో తమ జిల్లాను చేర్చాలంటూ ముందుకొచ్చారు. ఈ మేరకు అంకురార్పణ జరగ్గా అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో పలు రహదారులకు చోటు దక్కింది.
అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో పలు రాష్ట్ర రహదారుల ముఖచిత్రం మారిపోనుంది. జాతీయ రహదారుల తరహాలో నిర్వహణ జరగనుంది. రహదారులపై గుంతల్లేకుండా చూసుకోవడం, నిర్దేశిత సమయానికి బీటీ లేయర్ వేయడం, ఇరువైపులా ముళ్లకంపలు పెరిగిపోకుండా చూసుకోవడం తదితర చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) కింద గుత్తేదారులకు రాష్ట్ర రహదారుల నిర్వహణ అప్పగింతకు జిల్లా స్థాయి నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందాయి. గడిచిన అయిదేళ్లలో రెండు జిల్లాల్లో రహదారులు గుంతలు పడ్డాయి. తట్టమట్టి వేసిన దాఖాలాల్లేవు.
ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ విధ్వంసకర పాలనతో రహదారులు అధ్వానంగా మారాయి. పీపీపీ పద్ధతి ప్రకారం రహదారుల నిర్వహణకు ప్రజలను ఒప్పించగలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలను కోరారు. ఈ ప్రతిపాదన బాగుందంటూ ఎమ్మెల్యేలు చేతులెత్తి ఆమోదం తెలిపారు. రెండు విడతల్లో రెండు జిల్లాల్లో 11 రహదారులు పీపీపీ విధానం కిందకు వెళ్లనున్నాయి. మొదటి విడతలో 95 కిలోమీటర్ల రాజంపేట నుంచి గూడూరు, 43 కిలోమీటర్ల జమ్మలమడుగు నుంచి కొలిమిగుండ్ల రహదారులను ప్రతిపాదించారు.