Maoists Killed in Encounter :అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ భారీ ఎన్‌కౌంటర్ గురువారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగింది. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.
గురువారం తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో లచ్చన్న దళానికి చెందిన మావోయిస్టులు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత లచ్చన్నతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు తూటాలు తగిలి గాయాలు అయ్యాయి. ఓ పోలీసుకు కాలికి తూటా తగలడం, మరో పోలీసుకు పొట్టలో తగిలింది. దీంతో గాయపడిన పోలీసులను భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈనెల 3న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు మృతి : మంగళవారం కూడా ఛత్తీస్గఢ్ జిల్లా దండేవాడలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్, అలియాస్ రణదేవ్ దాదా మృతి చెందారు. ఇవాళ ఏసోబు మృతదేహం స్వస్థలం టేకులగూడెం చేరుకుంది. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వామపక్ష పార్టీ నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు తరలివచ్చారు. అనంతరం నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
మావోయిస్టు ఉద్యమ నేతగా అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు రాడికల్ యువజన సంఘం నాయకుడిగా పని చేశారు. అక్కడ భూస్వాముల నుంచి పేదలకు వందల ఎకరాలను పంచారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఏసోబు అలియాస్ రణదేవ్ దాదా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.