తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడు పదుల వయసులో వదలని సంకల్పం - 3 రోజుల్లో 12వేల అడుగుల ఎత్తైన పర్వతం అధిరోహించిన సాహసి - TREKKING ON DAYARA BUGYAL

ఏడు పదుల వయసులో వదలని సంకల్పం - హిమాలయాల్లోని దయారా బుగ్యాల్‌ అనే పర్వతాన్ని అధిరోహించిన ఏబీఆర్పీ రెడ్డి - మూడు రోజుల్లోనే 12 వేల అడుగుల ఎత్తైన శిఖరం అధిరోహించిన టీమ్

TREKKING ON DAYARA BUGYAL
ABRP REDDY TREKKED IN THE AGE OF 70 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 3:59 PM IST

Trekking in Himalayas : డెబ్బై ఏళ్ల వయసులో చాలా మంది తీర్థయాత్రలు చేస్తుంటారు. కొందరు ఇంటికే పరిమితమై మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతుంటారు. కానీ డెబ్బై ఏళ్ల వయసున్న డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి మాత్రం తీవ్రమైన చలి మధ్య డిసెంబర్‌లో హిమాలయాలలో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అతను 25 ఏళ్లకు పైగా ఐటీ, యానిమేషన్ రంగంలో ప్రముఖ సంస్థల్లో సీఈవోగా పనిచేశారు. 60 ఏళ్ల వయసులో రన్నింగ్ శిక్షణ ప్రారంభించి మారథాన్ రన్నర్‌గా ఎదిగారు.

కూతురు నుంచే ప్రేరణ : హైదరాబాద్ వంటి వెచ్చని ప్రదేశంలో నివసిస్తున్నప్పటికీ, చల్లని వాతావరణం అతనికి కొత్త కాదు. దీనికి ఏబీఆర్పీ రెడ్డి గతంలో దిల్లీ, ఇంగ్లండులో కూడా నివసించారు. 2024 డిసెంబరు నెలలోని తీవ్రమైన చలిలో హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఐదుసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన ఆయన కుమార్తె సింధు కూడా ఆయన వెంట వచ్చింది. ట్రెక్కింగ్ చేపట్టడానికి తన కూతురే తనకి ప్రేరణ అని డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి తెలిపారు.

12 వేల అడుగుల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన 24 మంది సభ్యుల బృందం (ETV Bharat)

రోజు 60 అంతస్థులు ఎక్కేవాడిని : ఏటా 20 వేల మందికి పైగా ట్రెక్కింగ్ చేసేవారికి మార్గనిర్దేశం చేసే ఇండియా హైక్స్ నిర్వహించే ట్రెక్ గ్రూప్‌లో డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి చేరారు. సాధారణంగా వయోపరిమితిని గరిష్ఠంగా 62 ఏళ్లుగా నిర్దేశించినప్పటికీ, ఏబీఆర్పీ రెడ్డి గుండె సంబంధిత అంశాలతో సహా ఇతర ఫిట్​నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో ట్రెక్కింగ్‌కు అనుమతించారు. జిమ్‌లో నెల రోజుల పాటు బాగా శిక్షణ పొందానని, ట్రెక్కింగ్‌కు సిద్ధంగా ఉండటానికి రోజుకు 60 అంతస్తులు వేగంగా ఎక్కే వాడినని అని ఏబీఆర్పీ రెడ్డి చెప్పారు.

“ట్రెక్కింగ్‌ చేసేటప్పుడు రాత్రిపూట ఉష్ణోగ్రతలు -10 సెంటీగ్రేడ్‌కు చేరుకోవడంతో తీవ్రమైన చలిని ఎదుర్కోవడం అత్యంత క్లిష్టమైన భాగం. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ మేము గుడారాల లోపల ఉన్నాం. స్లీపింగ్ బ్యాగ్‌లను ఉపయోగించాలి. అంతేకాకుండా, మనం ఎత్తుకు చేరుకున్నప్పుడు గాలిలో తక్కువ ఆక్సిజన్, తక్కువ వాతావరణ పీడనాలను ఎదుర్కోవాలి. దీని ఫలితంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్ రావచ్చు. నా కుమార్తె సింధు కూడా ట్రెక్కింగ్ గ్రూపులో ఉంది, పర్వతాలను ఎక్కి, దిగే సమయంలో నాకు చిట్కాలతో సహాయం చేసింది” -ఏబీఆర్పీ రెడ్డి

మూడు రోజుల్లో 12 వేల అడుగుల ఎత్తైన శిఖరం : మూడు రోజుల్లో తమ బృందంలోని మొత్తం 24 మంది ట్రెక్కర్లు 12 వేల అడుగుల ఎత్తులో ఉండే దయారా బుగ్యల్‌ శిఖరాన్ని చేరుకున్నట్లు ఏబీఆర్పీ రెడ్డి తెలిపారు. శిఖరాన్ని చేరుకున్నప్పుడు ట్రెక్కింగ్‌లో కష్టాలను పూర్తిగా మర్చిపోయి సంబరాలు చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. అక్కడి నుంచి కిందకు దిగడం మొదలైన 4వ రోజు సాయంత్రం బేస్ క్యాంప్‌కు చేరుకున్నామని అన్నారు. బేస్ క్యాంప్ డెహ్రాడూన్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు. 12 వేల అడుగుల ట్రెక్కింగ్ ఇచ్చిన స్ఫూర్తితో, 2025లో 18 వేల అడుగుల ఎత్తు ట్రెక్కింగ్‌కు సిద్ధం అవుతున్నానని డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి తెలిపారు.

Trekking: ట్రెక్కింగ్​ దిశగా అతివలు.. వీళ్లకు శిఖరాలే సలాం కొట్టాయి.!

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9మంది మృతి- ఇంకా అనేక మంది అక్కడే! - Uttarakhand Trek Accident

ABOUT THE AUTHOR

...view details