Masthan Sai Remand Report : యువతులు, మహిళల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో బాచుపల్లి పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు ప్రణాళిక చేసినట్లు నిర్ధారించారు. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి వివాదం సృష్టంచాడు. దీంతో అతడిపై పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా జోడించారు.
హత్య చేయడానికి యత్నం : మస్తాన్ సాయి ల్యాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వ్యక్తిగత వీడియోలను నటుడు రాజ్‌తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే అంతకు ముందే ఇతర డివైస్‌లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. లావణ్యను పలు మార్లు మర్డర్ చేయడానికి మస్తాన్ సాయి యత్నించాడు. లావణ్య వద్ద ఉన్న హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు మస్తాన్ ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. గత నెల జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.
మత్తులోకి జారుకున్న అనంతరం లైంగిక దాడి : మస్తాన్ సాయి వ్యవహారంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్‌తో మస్తాన్ సాయి అతని స్నేహితులు పార్టీలు చేసుకున్నట్లు తెలిసింది. యువతులతో గడిపిన సమయంలో వీడియోలు రికార్డు మస్తాన్ సాయి చేసుకున్నాడు. వీకెండ్స్‌లో మస్తాన్ సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవి. డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలోనే యువతుల వీడియోలు రికార్డ్ చేసేవాడు. అమ్మాయిలు గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వీడియోలు హార్డ్ డిస్క్‌లో పోలీసులు గుర్తించారు. మత్తులోకి జారుకున్న తరువాత అమ్మాయిలపై మస్తాన్ సాయి లైంగిక దాడి చేసేవాడు. మస్తాన్ సాయి సెల్ ఫోన్, హార్డ్ డిస్క్‌లపై ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్ ఇంకా దర్యాప్తు చేస్తోంది.