Senior IPS Officer AB Venkateswara Rao Will Retire Today :డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఐదేళ్లుగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో జగన్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ వీరభక్త అధికార గణం వేధించింది. సుదీర్ఘ సర్వీసులో చివరి రోజైనా ఆయన్ను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తుందా లేదా ఇప్పటి వరకూ ఆయన పట్ల అనుసరించిన కక్షసాధింపు ధోరణినే కొనసాగిస్తుందా అనేది నేడు తేలిపోనుంది.
జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండానే పదవీవిరమణ చేయించాలనే దురుద్దేశమే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 22 రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు సరికదా! ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. వాటిని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ అందజేశారు. చట్టం, నిబంధనలు పాటించే, న్యాయవ్యవస్థ ఆదేశాల అమలుకు కట్టుబడి ఉండే ఏ అధికారైనా సరే వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలి.
ప్రభుత్వం ఏబీవీకి పోస్టింగ్ ఇస్తుందా ? - ఇవ్వకుండానే సాగనంపుతుందా ! - IPS AB Venkateswara Rao
ఏబీవీపై అభియోగాలు మోపటమే తప్ప గత ఐదేళ్లలో ప్రభుత్వం అవేవీ నిరూపించలేకపోయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసు తేల్చనేలేదు. క్రిమినల్ కేసులోనూ అభియోగపత్రం దాఖలు చేయలేదు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు క్యాట్ కూడా ఆయనపై సస్పెన్షన్ ఎత్తేయాలని, విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలిచ్చాయి. అయినా జగన్ సర్కారు వాటన్నింటినీ బేఖాతరు చేస్తూనే ఉంది. ఏబీవీ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అభియోగాలు నిరూపించట్లేదు. సస్పెన్షన్ ఎత్తేయాలని న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా అమలు చేయట్లేదు. పదవీవి రమణ చివరి రోజు వరకూ కూడా ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.
క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉదయమే ఆదేశించినప్పటికీ రాత్రి వరకూ కూడా ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులివ్వలేదు. శుక్రవారం ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకూ ఆయన్ను సస్పెన్షన్‌లో కొనసాగిస్తూ పోస్టింగ్ లేకుండానే సాగనంపాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియార్టీ జాబితాలో ఏబీ వెంకటేశ్వరరావు అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి సీనియర్ అధికారిని ప్రభుత్వమే ఇంతలా వెంటాడి, వేటాడి వేధించిన ఘటనలు దేశచరిత్రలోనే అరుదు. కానీ 34 ఏళ్ల పాటు పోలీసుశాఖకు సేవలందించిన ఏబీవీకి కేవలం కక్షసాధింపు కోసం జగన్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పోస్టింగు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్‌లో ఉంచింది. డీజీ క్యాడర్ అధికారైన ఏబీవీకి జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. ఎవరైనా తమ కెరీర్ చివరిదశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీవిరమణ వరకూ సస్పెన్షన్‌లో ఉంచటం ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిదర్శనం.