Semi Conductor Factory in Kurnool District:ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14 వేల కోట్ల రూపాయలతో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరినట్లు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ఇటోయె మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, భారత్‌కు చెందిన హైడ్రైస్ గ్రూప్, బీఎన్ గ్రూప్‌లు రాష్ట్ర ప్రభుత్వం మధ్య హైదరాబాద్‌లో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగినట్లు ఆయన వెల్లడించారు.
14 వేల కోట్లతో భారీ పరిశ్రమ:భారీ సెమీ కండక్టర్ పరిశ్రమను 14 వేల కోట్లతో మనదేశంలో మొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానుందని టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేశ్ కృషితో ఈ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు. గత నెలలో మంత్రి లోకేశ్‌తో ఈ కంపెనీల ప్రతినిధులు అమరావతిలో సమావేశమై పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించారని, ఇప్పుడు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.
దీంతో వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వివరించారు. రాయలసీమలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు పెట్టుబడులకు ఎంతో అనుకూలమైందన్నారు. అక్కడ ఈ సెమీకండక్టర్ ప్రాజెక్టుతోపాటు మరికొన్ని పరిశ్రమలు రానున్నాయని మంత్రి వెల్లడించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న సీఎం ఆలోచనల్లో భాగంగా ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయన్నారు.