Visakhapatnam to Cherlapally Train Empty :విశాఖపట్నం నుంచి చర్లపల్లి వచ్చే సికింద్రాబాద్ జన సాధారణ్ రైలు ఖాళీగా బయలుదేరింది. రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఇలా జరిగినట్లు సమాచారం. పావుగంట ఆలస్యంగా విశాఖపట్నం నుంచి ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. ఓ వైపు సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న టైంలో ఇలా జరగడం గమనార్హం.
సమాచారం లేని కారణంగా సికింద్రాబాద్ జన సాధారణ్ రైలు గురించి ప్రయాణికులకు తెలియరాలేదు. దీంతో మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండగా, ఈ రైలు విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరాల్సి వచ్చింది. రిజర్వేషన్ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రైలు ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఎన్నో అగచాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఈ టైంలో ఇలా జరగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.