Second Warning At Godavari in Bhadrachalam Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు విస్తారంగా కురుస్తున్న వానలు, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం గోదావరి వద్ద ప్రవాహం జోరందుకుంది. ఈ నేపథ్యంలో భారీ వరద పోటెత్తడంతో గోదావరి నీటిమట్టం ఇవాళ మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద అలెర్ట్ కొనసాగుతోంది. రాత్రి 9 గంటల సమయానికి గోదారి నీటి మట్టం 49.90 అడుగులకు చేరింది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
Heavy Water Flow in Godavari : మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 13.3 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు వరద చేరువవుతోంది. ఎగువ నుంచి భారీ మొత్తంలో నీరు వచ్చే అవకాశం ఉండటంతో.. ముందస్తుగా 12,500 క్యూసెక్కుల చొప్పున నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పి. గన్నవరం, ఐనవిల్లి, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం లంకల్లో వరదనీరు చుట్టుముట్టింది. లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది. అధికారులు, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆ గ్రామాలకు రాకపోకలు బంద్ : గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నాన కట్టాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు వద్ద వరద నీరు రహదారి పైకి చేరటంతో భద్రాచలం నుంచి విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం వద్ద అధికారులు 25 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం గుబ్బల మంగి వాగు, సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం 48 అడుగులను దాటి ప్రవహిస్తోన్న గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - 73కి చేరితే ఏమవుతుందంటే? - BHADRACHAAM GODAVARI WATER LEVEL
48 దాటినప్పటి నుంచే సమస్య :ఇదిలా ఉండగా,భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. గోదావరి వరద ఉద్ధృతమయ్యే కొద్దీ దుమ్ముగూడెం మండలంతో పాటు భద్రాచలం పట్టణానికే ఎక్కువ ముంపు పొంచి ఉందని అధికారులు తెలిపారు. 43-48 అడుగుల మధ్య భద్రాచలానికి ముంపు ముంచుకొస్తుందని పేర్కొన్నారు. 48-53 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 13 గ్రామాలు, భద్రాచలం ప్రభావితమవుతాయని వెల్లడించారు.
53-58 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని 48 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. 63 నుంచి 68 మధ్య 6 మండలాల్లోని 85 గ్రామాలు, 73 అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలం సహా 109 గ్రామాలు ముంపు బారిన పడనున్నాయని తెలిపాారు. 2023లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటి పారుదల శాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు. గోదావరి, కృష్ణా పరీవాహకాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు.
తెలంగాణలో రికాం లేని వానలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains Across Telangana