Seasonal Fever Cases Increasing in Hyderabad :ప్రతి ఏటా ముసురుపట్టే సమయాల్లో వ్యాధులు మూగుతుంటాయి. వర్షాలతో పాటే మేమున్నాం అంటూ జ్వరాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇప్పటికే వ్యాధుల బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు జ్వరం, ఫ్లూ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
ఇక ఈసారి స్వైన్ ఫ్లూ సైతం విజృంభిస్తోంది. డెంగీ దండయాత్ర చేస్తోంది. హైదరబాద్‌లో వీటి ప్రభావం అధికంగానే ఉంది. పది రోజులుగా డెంగీ కేసులు మరింత పెరుగుతున్నాయి. నగరంలో అపరిశుభ్ర వాతావరణం, మురిగి నీరు నిలబడటం వంటి కారణాలతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు కాస్త తక్కువ ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ఈసారి వైరల్ ఫీవర్స్ , డిఫ్తీరియా, డయేరియా, గ్యాస్ట్రో సమస్యలు తీవ్రంగా వస్తున్నాయని చెబుతున్నారు.
తేమ వాతావరణం ఏర్పడి ముసుగు కప్పుకుని ఉండటంతో వైరస్ సైతం పంజా విసురుతోంది. స్వైన్‌ఫ్లూ కారకమైన హెచ్1ఎన్1 తేమ వాతావరణంలో మరింత ఉద్ధృతంగా ప్రజలపై దాడి చేస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీరు కారటం, గొంతు గరగర, ఒళ్లు నొప్పులు అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.
వైరల్ ఫీవర్లే ఎక్కువ :చిన్నారులు సైతం విష జ్వరాలు, జలుబుతో నీలోఫర్‌కి క్యూ కడుతున్నారు. గతంతో పోలిస్తే గడచిన 10 రోజుల్లో కనీసం వంద మంది వరకు వైరల్ ఫీవర్లతో ఆస్పత్రికి వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే తీవ్రమైన లక్షణాలు ఉండటం లేదని జ్వరం నాలుగు నుంచి ఐదు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సీజన్‌లో వచ్చే జ్వరాల్లో అత్యధికంగా వైరల్ ఫీవర్లే ఉంటాయని అవి మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మంచి ఆహారం తీసుకోవటం ద్వారా వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.