Student Sied after School Gate Collapse in Hayathnagar : చావు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మన నిర్లక్ష్యం, పొరపాటే మనపాలిట శాపంగా మారుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరో చేసిన పొరపాటు, నిర్లక్ష్యానికి ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండేలా చేసింది. ఉదయం ముద్దుముద్దు మాటలతో తన కుమారుడు చేసిన వీడ్కోలే తమకు చివరివని ఆ తల్లికి అప్పుడు తెలియదు. సాయంత్రం కుమారుడు ఇంటికి వస్తాడని ఎదురుచూసే సమయంలో వచ్చిన పిడుగులాంటి వార్త ఆ మాతృమూర్తిని గుండెను ఆపేసినంత పని చేసింది. తన ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని తెలిసి ఆ కన్నతల్లి హృదయం ఎంతగా ద్రవించిపోయందో. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి బలైనా ఓ ప్రభుత్వ స్కూల్ చిన్నారి విషాద గాథ ఇది.
పాఠశాల గేటు విరిగి మీద పడడంతో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి అజయ్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇవాళ సాయంత్రం జరిగింది. సాయంత్రం పాఠశాలలో తోటి పిల్లలతో అజయ్ ఆడుకుంటున్నాడు. కొంతమంది పిల్లలు గేటు ఎక్కి అటూ ఇటూ ఊగుతూ ఆడుకుంటున్నారు. గేటు వెల్డింగ్ జాయింట్లు బలహీనంగా ఉండడంతో విరిగి అక్కడే ఆడుకుంటున్న అజయ్ మీద పడింది. గేటు మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.