తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో మళ్లీ ఎన్నికలు - ఈసారి ఆ ఎంపీ పదవులు ఎవరికి వరించేనో?

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల - మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీలు

AP By Elections For Rajya Sabha
AP By Elections For Rajya Sabha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 4:10 PM IST

Updated : Nov 26, 2024, 4:34 PM IST

Rajya Sabha By Election Schedule in AP : ఆంధ్రప్రదేశ్​ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూలు రిలీజ్ చేసింది. ఏపీ, ఒడిశా, పశ్చిమబంగాల్, హరియాణాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్​లోని ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యల రాజీనామాతో ఖాళీలు ఏర్పడ్డాయి. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్‌ 10న తుది గడువుగా నిర్దేశించింది. డిసెంబర్‌ 11న నామినేషన్లు పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్‌ 13 వరకు తుదిగడువు విధించింది. డిసెంబర్‌ 20న రాజ్యసభ ఉపఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, అదేరోజు లెక్కింపు జరుగుతుందని షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం పేర్కొంది.

Rajya Sabha By Election Schedule (ETV Bharat)

ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 175 శాసనసభ స్థానాలు ఉండగా, 164 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైఎస్సార్​సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్సార్​సీపీ సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పతనస్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో జరగనున్న ఆ 3 స్థానాల ఉప ఎన్నికలకు కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే, ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా? భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా? అనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Mopidevi Venkataramana and Beeda Masthan Rao : ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్సార్సీపీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక రాజ్యసభ ఎంపీ పదవికి ఆ పార్టీ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు ఇద్దరి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 29వ తేదీన ఆమోదం తెలిపారు. అనంతరం వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.

Ryaga Krishnaiah Resignation : వీరిబాటలోనే ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య సైతం తన పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సెప్టెంబర్ 23వ తేదీన రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ సెప్టెంబర్ 24న ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేయటం గమనార్హం. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్టు ఆ సమయంలో ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. తాజాగా వీరి రాజీనామాలతో ఖాళీ అయిన ఆ మూడు స్థానాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలోని సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్​ అయ్యింది.

తెెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు స్టార్ట్ - ఎప్పుడైనా జరిగే ఛాన్స్!

'సర్పంచ్​గా ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు ఇస్తా' - సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పోస్టు

Last Updated : Nov 26, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details