Unanimous Election of Sarpanch in Local Bodies : రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌నే రాలేదు. అప్పుడే కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు గెలిచేసి, సంబురాలు సైతం చేసేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా ఉంటారు. వీరిలో 700 మందికి ఓటు హక్కు ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఆ ఊరికి కొత్త సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. దరావత్ బాలాజీ అనే వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే, సొంత డబ్బులతో ఊళ్లో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామి గుళ్లు కట్టిస్తానని, అలాగే విగ్రహాలు పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. బొడ్రాయి పండుగ ఖర్చుల కోసం గడప గడపకు రూ.1000 చొప్పున పంచుతానని హామీ ఇచ్చాడు.
ఇందుకోసం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఆ గ్రామస్థులు కూడా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ అయిన తర్వాత మాట తప్పితే ఎలా అని వారంతా బాలాజీని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తానని మాటిచ్చాడు. దీంతో గ్రామస్థులంతా సమావేశమై అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నారు. ఇందులో సర్పంచ్ అభ్యర్థి, గ్రామస్థులు సంతకాలు పెట్టారు. గడువులోగా ఈ పనులు పూర్తి అయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని తెలిపారు. ఈ అగ్రిమెంట్‌ను అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని ఆ పేపర్‌పై రాసుకున్నారు.