Sandhya Theatre Stampede :రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో దర్యాప్తు చేయవచ్చని, అయితే వారిని అరెస్ట్ చేయరాదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన మంగళవారం విచారణ చేపట్టి, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబందం లేదని తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.నవీన్ కుమార్ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించని తెలిపారు. హీరో అల్లుఅర్జున్ థియేటర్‌కు వస్తున్నట్లు నిర్మాతల కార్యాలయ సిబ్బంది థియేటర్ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారని వివరించారు.
ఘటన జరిగిన రోజు సీనియర్ అధికారులైన ఏసీపీ, డీసీపీలు థియేటర్‌కు వచ్చి భద్రతను పరిశీలించారని పేర్కొన్నారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.