Saffron Cultivation In Hyderabad : కశ్మీర్‌కే పరిమితమైనటువంటి కుంకుమ పువ్వును ఇప్పుడు భాగ్యనగరంలోనూ పండిస్తున్నాడు ఓ యువకుడు. కశ్మీర్ శీతల వాతావరణంలో కుంకుమ పువ్వు సాగు జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఈ పంట పండించాలనే ఆలోచన చేసింది వ్యవసాయదారుడు కాదండోయ్. గుర్రంగూడకు చెందిన బీటెక్ స్టూడెంట్ లోహిత్‌రెడ్డి. తనకు వ్యవసాయం చేయడంపై అమితమైన ఆసక్తి ఉండటంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం అదే ట్రెండ్‌గా మారింది. అనుకున్నంత స్థాయిలో ఉత్పత్తి జరిగితే హైదరాబాద్ నగరంలోనే కుంకుమ పువ్వును పండించే అవకాశం వస్తుంది.
ఏవిధంగా కుంకుమపువ్వు సాగు చేస్తారంటే? :270 చదరపు అడుగులున్నటువంటి గదిలో గాలిలో తేమ, ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉండాలి. ట్రేలలో కుంకుమ పువ్వు సాగు చేపట్టాడు. ఉష్ణోగ్రత పగటి వేళ 17 డిగ్రీలు, రాత్రి 9 డిగ్రీలు ఉండేవిధంగా చూసుకోవాలి. అక్టోబరు మొదటివారంలో 2 లక్షల రూపాయలు వెచ్చించి కశ్మీర్ నుంచి 200 విత్తనాలు తెచ్చి సాగు మొదలెడితే డిసెంబరు నెలలో కుంకుమ పువ్వు ఉత్పత్తి వస్తోంది. ఒక విత్తనానికి రెండు నుంచి మూడు పువ్వులు వస్తాయి. వీటిపై గ్రాముకు రూ.800-1000 ధర లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న సాగుతో 150 గ్రా. వరకు దిగుబడి వస్తుందనే అంచనా ఉంది. ఒక్కసారి ఈ పంట సాగుకు పెట్టుబడి పెడితే మున్ముందు ఖర్చు చేయకుండానే పూల ఉత్పత్తి వస్తుంది.
ఏవిధంగా తెలుసుకున్నాడంటే? :గూగుల్, యూట్యూబ్‌లలో ఈ పంటకు సంబంధించిన వీడియోలను వీక్షించాడు. సాగు చేసే ప్రాంతాలకు వెళ్లి మెలకువలు తెలుసుకుని కుంకుమ పువ్వు సాగుకు ఉపక్రమించాడు.