Rythu Bharosa Amount Credited To Farmers Account :అన్నదాతలకు ఏడాదికి రెండు సీజన్లలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాసంగి పెట్టుబడి కోసం ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వరకు ఎకరంలోపు ఉన్న 40,985 మంది రైతుల ఖాతాల్లో రూ.22.27 కోట్లు జమ చేసింది.
జిల్లాలో 3.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, యాసంగిలో ఇప్పటివరకు 2.73 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.84 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.229.30 కోట్లు జమ చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినా, గత ప్రభుత్వం గుట్టలు, లేఅవుట్లు, ప్లాట్లు, వాణిజ్య భూములకు కూడా సాయం అందించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూ సర్వే చేపట్టింది.
పెట్టుబడి సాయం పొందే రైతుల సంఖ్య పెరిగింది :అనర్హత ఉన్న భూ వివరాలు తొలగించడంతో ఆలస్యం జరిగింది. భూ సర్వేలో సాగుకు యోగ్యం కాని భూములు 4,900 ఎకరాలు తొలగించినా, సాగు భూముల రిజిస్ట్రేషన్లు పెరగడంతో పెట్టుబడి సాయం పొందే రైతుల సంఖ్య పెరిగింది. తుది నివేదిక ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో 1,91,570 మంది రైతు భరోసా పథకానికి అర్హులని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రూ.252.92 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్న 40,985 మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.22.27 కోట్లు జమ చేశారు. రానున్న రోజుల్లో 2, 3, 4, 5, అంతకంటే ఎక్కువ ఉన్న అన్నదాతలకు దశల వారీగా నిధులు జమ కానున్నాయి.