Rush at Medaram Jatara 2024 :ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram Jatara) ప్రసిద్దిగాంచింది. ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. వచ్చే నెలలో మహాజాతర జరగనుంది. ఇప్పట్నుంచే నుంచే మేడారంలో భక్తుల తాకిడి మొదలైంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు.
Medaram Jatara 2024 :తొలుత సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం మేడారం బాట పడుతున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు, కుంకమలు, గాజులు, చీర సారె వనదేవతలకు (Sammakka Saralamma Jatara 2024) సమర్పిస్తున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జనసాగరంగా మేడారం జాతర - రెండు రోజుల్లో లక్షకు పైగా భక్తులు
మేడారంలోని జంపన్నవాగు, చిలకలగుట్ట, నార్లపూర్ తదితర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తులతో మేడారంలోని ప్రధాన దారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి. రోజూ లక్షమందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.
కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి (State Election Commissioner Parthasarathi) దర్శించుకున్నారు. ఏటా ఇక్కడికి వస్తామని తెలిపారు. వనదేవతల దర్శనానికి ముందు గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. కుటుంబ సభ్యులతో సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటామని పేర్కొన్నారు. ఇక్కడికి రావడం సంతోషంగా అనిపిస్తుందని పార్థసారథి వివరించారు.