తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తికమాసం స్పెషల్ : ఆ పుణ్యక్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు - ఫ్రీగా వెళ్లొచ్చేయండి - TGSRTC SERVICES TO POPULAR TEMPLES

కార్తిక మాసం దృష్యా ప్రముఖ దేవాలయాలకు ఆర్టీసీ సేవలు - మహాలక్ష్మీ పథకంతో టీజీఎస్​ ఆర్టీసీకి బ్రహ్మరథం పడుతున్న మహిళలు

TEMPLES IN TELANGANA
TGS RTC SERVICES TO TEMPLES (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 2:07 PM IST

TGSRTC Services to Popular Temples : ఆధ్యాత్మికత మరింత సంతరించుకునే కార్తికమాసం శనివారం (నవంబర్ 02) నుంచి మొదలైంది. ఈ మాసంలో మహిళలంతా ఎక్కువగా దీపారాధన చేస్తుంటారు. దాదాపు అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌలభ్యం కోసం టీజీఎస్​ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నిర్మల్‌ పట్టణం నుంచి పలు ప్రముఖ శివాలయాలకు బస్సు సర్వీసులను సిద్ధం చేస్తున్నారు.

శైవ క్షేత్రాలకు :కార్తిక మాసం సందర్భంగా ప్రతీ సోమవారం నిర్మల్‌ నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నారు. కాళేశ్వరం, శ్రీశైలం, అరుణాచలం ప్రాంతాలకు సూపర్‌ లగ్జరీ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్‌ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేములవాడ వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం అందరికీ, అన్ని సందర్భాల్లోనూ వీలు కాదు.

దీనికితోడు సురక్షిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిర్దేశించిన ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం నేపథ్యంలో నడిపే సర్వీసులపై ప్రయాణికులు ఆసక్తితో ఉన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుండటంతో వారి సౌలభ్యం కోసం ప్రతీ పౌర్ణమి రోజున బస్సు సర్వీసు అందుబాటులో ఉంటోంది. ఈసారి కార్తిక పౌర్ణమి కావడంతో మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉంది.

30 మంది ఉంటే :మనం వెళ్లాలనుకునే పుణ్యక్షేత్రానికి బస్సు ఎప్పుడుంది? ఏ సమయంలో వెళ్తుంది? అనే వివరాలు తెలుసుకునేందుకు, బస్సు ఎక్కేందుకు నేరుగా ప్రయాణ ప్రాంగణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా 30 మంది ప్రయాణికులుంటే అది కాలనీ అయినా, గ్రామమైనా నేరుగా వారున్న చోటకే బస్సును టీజీఎస్​ ఆర్టీసీ వారు పంపించనున్నారు. ఒకవేళ అంతమంది పోగయ్యే అవకాశం లేకపోతే, నేరుగా ప్రయాణ ప్రాంగణం నుంచి ఎలాగూ బస్సు సర్వీసులు నిర్ణీత వేళల్లో అందుబాటులో ఉండనున్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి

పవిత్ర కార్తిక మాసంలో వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని భక్తులందరూ కోరుకుంటారు. ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా వెళ్లే బదులు ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించొచ్చు. ప్రయాణికుల కోరిక మేరకు నిర్మల్‌ పట్టణం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత శైవ క్షేత్రాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకునేందుకు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లను ముందస్తుగా బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాం. మరింత సమాచారం కోసం 99592 26003, 94927 67879, 73828 42582 నెంబర్లకు ఫోన్​ ద్వారా సంప్రదించాలి.-ప్రతిమా రెడ్డి, డీఎం, నిర్మల్‌

పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? - తెలంగాణ ఆర్టీసీ సూపర్​ ఆఫర్ - మీ ఇంటికే బస్సు

రైట్​ రైట్​ : వైరల్ వీడియో మంత్రికి నచ్చింది - పోయిన ఉద్యోగం తిరిగొచ్చింది

ABOUT THE AUTHOR

...view details