తెలంగాణ

telangana

ETV Bharat / state

YUVA: ఆర్టీసీ ఎండీనే మెప్పించిన ఈ చూపులేని గాయకుడి గురించి మీకు తెలుసా?

సోషల్​ మీడియాలోని పోస్ట్​ను చూసి స్పందించిన సజ్జనార్​ - అంధగాయకుడికి ఏదైనా అవకాశం కల్పించాలని కీరవాణికి విజ్ఞప్తి

BLIND MAN SINGER RAJU
అంధగాయకుడు రాజుతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Palasa Singer Raju in RTC Bus : బస్సు ప్రయాణంలో ఆ యువకుడు పాడిన పాట ప్రస్తుతం తన జీవితాన్నే కొత్త మజిలీ వైపు నడిపిస్తోంది. ఆర్టీసీ బస్సులో తన పాట ఆ నోట ఈ నోట పాకి చివరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ని ఫిదా చేసింది. ఆయన ఎక్స్‌ ఖాతాలో వీడియో పోస్ట్‌ చేయడంతో అవకాశం తలుపు తట్టింది. సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పాట పాడే అవకాశం కల్పించింది.

చేత్తో దరువేస్తూ హత్తుకునేలా పాడుతున్న తన పేరు రాజు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోని శంషాబాద్ స్వస్థలం. తల్లిదండ్రులు హనుమయ్య, సత్తెమ్మ. వారికి నలుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. నాలుగో సంతానమే రాజు. చూపు లేకుండా జన్మించాడు. తండ్రి మరణంతో తల్లే అన్నీతానై చూసుకుంటున్నారు. ఇంటి పైకప్పు కూలిపోవడంతో కుమార్తె స్వప్న ఇంట్లో ఉంటున్నారు.

మృదంగం కూడా : చూపులేకున్నా చరుకుదనం ఎక్కువ రాజుకి. టీవీ, రేడియోల్లో ఏదైనా వింటే చాలు ఇట్టే గ్రహించి కంఠస్థం చేసేవాడు. హమ్మింగ్ చేస్తూ పాటలు పాడేవాడు. క్రమంగా చేతితో దరువేస్తూ పాడటం అలవర్చుకున్నాడు. సంగీతం పైనా మక్కువ పెంచుకుని జయ కుమారాచారీ మాస్టర్ వద్ద మృదంగం నేర్చుకున్నాడు. బుచ్చయ్యచారీ మాస్టర్‌ వద్ద కర్ణాటక ఓకల్ సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించాడు.

అంధత్వం ఉన్నా అద్భుత గానంతో ఆకట్టుకుంటున్నాడు రాజు. గాత్రం బాగుండటంతో చాలా కార్యక్రమాల్లో పాడేందుకు ఆహ్వానం అందుకున్నాడు. ఆర్కెస్ట్రాలో పాడిన అనుభవం కూడా ఉంది. రాజు ప్రతిభ గుర్తించిన తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమాల్లో పాటలు పాడే అవకాశాలు కల్పించారు .

సినిమాలో అవకాశం : వేదికలపై పాడుతున్న రాజుకి మొదటి అవకాశం కూడా సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. తను పాడిన పాటను వీడియో తీసి కీర్తి అనే అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది డ్యాన్స్ మాస్టర్ జాకీ కంటపడటంతో రాజు ప్రతిభ గురించి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచెకు తెలిపారు. ఆయన పలాస సినిమాలో శ్రీకాకుళం యాసలో పాడే అవకాశం కల్పించారు. అలా తొలిసారి సినిమాలో పాడే ఛాన్స్‌ కొట్టేశాడు రాజు.

స్పందించిన సంగీత దర్శకులు : బస్సు ప్రయాణంలో రాజు పాట వీడియోను ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మ‌నం చూడాలే కానీ ఇలాంటి మ‌ట్టిలో మాణిక్యాలు ఎన్నో! అంటూ ఓ వ్యాఖ్య జోడించారు. ఒక అవ‌కాశం ఇచ్చి చూడండని ఎం.ఎం.కీరవాణికి ట్యాగ్ చేశారు. సజ్జనార్‌ పోస్ట్‌కి సంగీత దర్శకుడు తమన్‌ స్పందించారు. తనతోపాటు ఆహా ఇండియన్ ఐడల్- 4 మ్యూజిక్ షోలో పాట పాడేందుకు అవకాశం కల్పిస్తానని రాజుకి హామీ ఇచ్చారు.

చూపులేకుండా జన్మించినా పరిసరాల్లో ఏం జరుగుతుందో రాజు ఇట్టే పట్టేస్తాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. డబ్బాలపై దరువేస్తూ పాటలు పాడేవాడని చెబుతున్నారు. ఒకానొక సమయంలో ప్రదర్శనలో అవకాశాలు రాక తీవ్ర మనోవేదనతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెబుతున్నారు. ఈలోగా సజ్జనార్ రాజు వీడియో పోస్ట్‌ చేయడం సంగీత దర్శకుడు తమన్‌ రాజుతో కలిసి పాడుతానని చెప్పడం సంతోషంగా అనిపిస్తుందని అంటున్నారు.

పుట్టుకతోనే చీకటిలో చిక్కుకున్న రాజుకి పాటే వెలుగుదారి చూపింది. చూపు లేదని జీవితంలో ముందుకెళ్లలేనని కలతపడిపోలేదు. అంధులైనంత మాత్రన ఆగిపోకూడదని ప్రతిభ నీ తోడైతే అవకాశాలు వాటంతట అవే తలుపు తడతాయని నిరూపిస్తున్నాడు.

YUVA : లక్ష్యం ముందు చిన్నబోయిన శారీరకలోపం - గురిపెడితే మెడల్ ఖాయం - DHANUSH SRIKANTH IN KHELO INDIA

YUVA : మత్తు వదలరా మిత్రమా​ - షార్ట్ ఫిల్మ్‌తో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్న స్టూడెంట్స్​ - Drugs Awareness Short Film

ABOUT THE AUTHOR

...view details