ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలకు గుంతల రోడ్లు - బాబాయ్ పొలానికి మాత్రం తారు రోడ్డు! - ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి

Road Construction For YSRCP Leader : కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమోగానీ కనీసం గుంతలనైనా పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అని వాహనదారులు వేడుకుంటున్నా జగన్ ప్రభుత్వంలో కదలిక లేదు. కానీ అసలు నివాసాలే లేని మార్గంలో మాత్రం తన వాళ్ల కోసం 30 లక్షల రూపాయలు వెచ్చించి తారు రోడ్డునే నిర్మించారు. ఈ నిర్వాకం ఎక్కడ, ఎవరి కోసం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Road_Construction_For_YSRCP_Leader
Road_Construction_For_YSRCP_Leader

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 12:35 PM IST

ప్రజలకు గుంతల రోడ్లు - నివాసాలే లేని సీఎం జగన్ బాబాయ్ పొలానికి తారు రోడ్డు!

Road Construction For YSRCP Leader :రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వాటిల్లో పడి అమాయకుల ప్రాణాలు సైతం పోతున్నాయి. కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమోగానీ కనీసం గుంతలనైనా పూడ్చి పుణ్యం కట్టుకోండి మహా ప్రభో అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM jagan Mohan Reddy) ప్రభుత్వంలో కదలిక లేదు. మరోవైపు ప్రజలు తిరగని, అసలు నివాసాలే లేని మార్గంలో రూ.30 లక్షలు వెచ్చించి తారు రోడ్డునే నిర్మించారు. విషయమేమిటా అని ఆరా తీస్తే ఆ రోడ్డు జగన్‌ చిన్నాన్న, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గం కావడంతో ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు నిర్మించి అధికారులు స్వామి భక్తి చాటుకున్నారు.

YV Subba Reddy Agricultural Field in Bapatla District :బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు వంద ఎకరాల మేర వ్యవసాయ భూములు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి 2.5 కి.మీ. మేర ఆ వ్యవసాయ క్షేత్రం వరకు రోడ్డు వేసేశారు. ఈ మార్గంలో ఒక్క నివాస గృహం లేకపోయినా సరే వైవీ సోదరుల కోసమే దీనిని నిర్మించారు. కొంత కాలం కిందట ఆయన ఆదేశించడం, అధికారులు స్వామి భక్తి చాటుకుంటూ ప్రజాధనాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మించడం చకచకా జరిగిపోయాయి.

రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణాలపై జగన్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం: కాగ్

Road to YV Subbareddy Farm :పునరావాస కాలనీ గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిధిలో ఉన్న అనమనమూరు నుంచి సుమారు 70కి పైగా కుటుంబాల్ని 12 ఏళ్ల కిందట ఖాళీ చేయించి, బొడ్డువానిపాలెంలో పునరావాస కాలనీకి తరలించారు. ఆ కాలనీకి చేరుకునేలా రహదారి నిర్మిస్తామని చెప్పినా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. బాధితులు అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా స్పందన కరవైంది. చివరకు ఆ కాలనీవాసులే సొంతంగా డబ్బులు వెచ్చించి గత నవంబరులో మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. వీరి గోడు పట్టించుకోని అధికారులు, ఒక్క నివాస గృహం లేకపోయినా వైవీ సుబ్బారెడ్డి పొలానికి రోడ్డు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.

గుడివాడలో రోడ్డు కోసం మహిళల నిరసన - ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం

వైవీ సుబ్బారెడ్డి పొలానికి రోడ్డు నిర్మాణంపై బాపట్ల జిల్లా పంచాయతీరాజ్‌ డీఈ రమేశ్‌ను వివరణ కోరగా, పంచాయతీ తీర్మానం మేరకు ఆ రోడ్డు నిర్మించామని, ఆ పనుల్ని కలెక్టర్‌ మంజూరు చేశారని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లు నిర్మించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. డ్వామా పీడీ అర్జునరావును వివరణ కోరగా తాను బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు అవుతోందని, తన హయాంలో ఆ పనులు జరగలేదని చెప్పారు.

నాణ్యత లోపం - నెల రోజులు కాకముందే రహదారి గోతుల మయం

ABOUT THE AUTHOR

...view details