Junk Food Heart Disease : చాలా మంది ఇంటి వంటల కంటే బయట దొరికే అల్ట్రా ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు. చూడగానే వావ్ అనిపించడం, ఘుమఘుమలాడే వాసనలతో నోరురించే వాటిని లొట్టలేసుకుంటూ తింటున్నారు. కానీ వీటి తయారీలో రంగులు, మసాలలు, ఫుడ్ కెమికల్స్ ఎక్కువగా కలుపుతారు. ఫలితంగా మనం అనారోగ్యాలను కోరి మరి కొని తెచ్చుకుంటున్నాం! అయితే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అధికంగా ఉందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
స్లైస్డ్ వైట్ బ్రెడ్, చక్కెరతో కూడిన శీతల పానీయాలు, అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు.. వంటివాటితో పాటు వివిధరకాలు అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) జాబితాలోకి వస్తాయి. వీటిని వినియోగం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ముప్పు పెరుగుతుందని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు తాజా ఆహారం, చాలా పరిమితంగా ప్రాసెస్ చేసిన దినుసులతో చేసిన సంప్రదాయ తినుబండారాలను ప్రజలు ఎక్కువగా తీసుకునేవారు. కానీ, ఇప్పుడు చాలా దేశాల్లో యూపీఎఫ్‌ల వినియోగం ఎక్కువవుతోందని పరిశోధకులు చెప్పారు. ఇలాంటి వంటకాల్లో ఉపయోగించే పదార్థాలు ల్యాబుల్లో తయారవుతుంటాయని, అవి అనారోగ్యకరమని పేర్కొన్నారు.
ఊబకాయం, మధుమేహం..
యూపీఎఫ్‌లలో సోడియం, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటివి మోతాదుకు మించి ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
చాలా మంది బయట బండి మీద అమ్మే పకోడీలు, మిర్చీలు, బజ్జీలు అనారోగ్యకరమని చిప్స్, కేకులు, పిజ్జాలు, బర్గర్లు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, వీటివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, పెద్దవారిలో పొట్ట రావడం లాంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ వంటివి తినేవారు తాజా పండ్లు, కూరగాయలు వంటివి తక్కువగా తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో శరీరానికి అవసరమైన విటిమిన్లు, ఖనిజాలు, పోషకాలు లభించవని తెలిపారు.
ఇలా అనేకరకాల అనారోగ్య సమస్యలకు దారితీసే అల్ట్రా ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజూ కనీసం అరగంట సేపు శారీరక శ్రమను కలిగించే వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కొత్త ఏడాదిలో స్వీట్లు తినకూడదని నిర్ణయించుకున్నారా ? - ఈ టిప్స్‌తో మీ రిజల్యూషన్ నేరవేర్చుకోండి!
'మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ'- రోజు ఎన్ని ఎక్కాలో తెలుసా?