Rice for New Ration Card Holders: కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా రేషన్ కార్డు వచ్చినవారికి బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాటు ఇందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది.
కొత్త లబ్ధిదారులకు బియ్యం: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలు, 14 పురపాలికలు, రెండు నగర పాలికల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించి రేషన్ కార్డులు అర్హులను ప్రకటించారు. ఆ తర్వాత గత నెల 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభించే లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని 1,608 మందికి రేషన్ కార్డులు అందజేశారు. కొత్త కార్డుల్లో 9,663 యూనిట్లు (లబ్ధిదారులు) నమోదవగా ఈ నెల నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు గానూ ఉమ్మడి జిల్లాకు ఈ నెలలో 54.751 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరిగింది.
దరఖాస్తుల ఆధారంగా: మరోవైపు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన మిగతా లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు . కొత్త రేషన్ కార్డుల కోసం నాలుగు జిల్లాల్లో కలిపి 1,01,103 దరఖాస్తులు వచ్చాయి. అర్హులను గుర్తించే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెల నుంచి వారికి కూడా బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.