Revanth Reddy Promises of Congress Schemes : కాంగ్రెస్ 2023 శాసనసభ ఎన్నికల్లో వదిలిన బ్రహ్మాస్త్రాలు ఆరు గ్యారంటీలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా స్వయంగా ఈ గ్యారంటీలను ఆవిష్కరించిన కాంగ్రెస్ వీటి అమలుపై ప్రజలకు మరింత భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ గ్యారంటీలపై ప్రత్యర్థి పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా వీటినే ప్రధానాస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేసుకుంది.
వంద రోజుల్లో వీటిని అమలు చేస్తామని చెప్పి తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ 2హామీల అమలును ప్రారంభించింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajeev Arogyashri) పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపును అమలు చేశారు. తాజాగా మరో రెండు గ్యారంటీలైన రూ.500 గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు 2వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ హామీని ఈనెల 27న అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో ప్రకటించారు.
Congress Six Guarantees Implementation :కాంగ్రెస్ పార్టీ 6గ్యారంటీలుగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిర ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం వంటి పథకాలను ప్రకటించింది. దీనిలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ డిసెంబర్ 7న ప్రమాణం చేయగా, డిసెంబర్ 9న వీటిని ప్రారంభించారు. మరి ఇప్పటి వరకు ఈ పథకాల అమలు తీరు ఎలా ఉందని పరిశీలిస్తే అంతటా సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది.
Free Bus Travel in Telangana :మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 18కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఈ పథకం అమలుకు ముందుతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి వరకు ఉద్యోగాలు, వ్యాపార లేదా ఇతర పనుల కోసం వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించిన మహిళలు ఆర్టీసీ బస్సుల బాట పట్టారు. అప్పటికే నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలతో పాటు వీరికి కూడా ప్రయాణ ఛార్జీలు ఆదా అవుతున్నాయి.
కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల పంచాయితీ - కుటుంబీకులకు ఇప్పించేందుకు ముఖ్యనేతల విశ్వ ప్రయత్నాలు!
నెల వారీ ప్రయాణ ఖర్చుల కోసం అయ్యే సుమారు 15వందల రూపాయల నుంచి 2వేల రూపాయల వరకు ఆదా చేసుకోగల్గుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి మహిళలు దీని ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందుతున్నారు. ఆదా చేసిన ఛార్జీల డబ్బులతో మహిళలు తమ కుటుంబ జీవితాన్ని మరింత మెరుగ్గా గడుపుతున్నారు.
Mahalaxmi Scheme in Telangana : మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆర్టీసీకి కూడా గణనీయంగా ప్రయోజనం కల్గిస్తోంది. దీని అమలు తర్వాత ఆక్యూపెన్సీ రేషియో మెరుగుపడింది. పలు జిల్లాల్లో అప్పటి వరకు 60శాతం ఓఆర్ 90శాతానికి పెరిగింది. పలు డిపోల్లో వంద శాతానికి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు(Express Buses) కిక్కిరిసి కనిపిస్తున్నాయి. మహిళల ప్రయాణం కోసం జారీ చేస్తున్న జీరో టికెట్ డబ్బులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుండగా, పెరిగిన ప్రయాణికుల సంఖ్యతో ఆ మేరకు ఆర్టీసీ ఆదాయం కూడా పెరుగుతోంది.
ఇప్పటి వరకు తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను ఇది కొంతైనా గట్టెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్న రూట్లలో గతంలో బస్సు సర్వీసులను నిలిపివేసిన ఆర్టీసి పెరిగిన ప్రయాణికుల సంఖ్యతో వాటిని నడపడం ఆరంభించింది. వాటి ద్వారా కూడా ఆర్టీసీకి ఆదాయం పెరగనుంది. ఇలా మహాలక్ష్మి పథకం అమలు ఇప్పటి వరకు సానుకూలంగానే సాగుతోంది.