Fake MLA Car Sticker Case in Repalle :ఆ యువకుడు తన కారును పోలీసులు ఆపకుండా, టోల్గేట్ల దగ్గర డబ్బులు చెల్లించకుండా ఉండడానికి ఓ పథకాన్ని రూపొందించాడు. ఏకంగా మంత్రి పేరుతో ఉన్న నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ను తన వాహనానికి అతికించాడు. ఇలా కారుతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవాడు. కానీ ఇంతలోనే అతడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దీనిని మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి గమనించి అతన్ని ప్రశ్నించాడు. దీంతో ఆయనతో గొడవపడి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడి ఆట కట్టించారు.
ఇందుకు సంబంధించి రేపల్లె పట్టణ సీఐ మలికార్జున రావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన అభినయ్ అనే యువకుడు రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ పేరుతో అక్రమంగా నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ను వినియోగిస్తున్నాడు. దానిని అతడి కారుకు అతికించి రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ విషయాన్ని పెనుమూడి హైవే వద్ద మంత్రి అనగాని వ్యక్తిగత సహాయకుడు ధర్మతేజ గమనించి ఆ కారును ఆపాడు.
ఎమ్మెల్యే స్టిక్కర్ ఎక్కడిదని ధర్మతేజ వారిని అడిగాడు. అందులోని అభినయ్, సల్మాన్ ఆయనను దుర్భాషలాడి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై ధర్మతేజ రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రేపల్లె మండలం అరవపల్లి వద్ద బుధవారం నాడు కారును స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు అభినయ్ని అదుపులోకి తీసుకొని విచారించగా టోల్గేట్ల వద్ద కారుకు డబ్బులు చెల్లించకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు ఈ విధంగా చేసినట్లు ఒప్పుకున్నాడు.