Stone Removal Machine: సాధారణంగా పంటలో కలుపు మొక్కలు ఉంటే కూలీలతో సాయంతో తొలగిస్తాం. మరీ రాళ్లూ రప్పలతో ఉన్న సాగుకు ఉపయోగపడని భూమి ఉంటే ఏం చేస్తాం? ఖాళీగా వదిలేస్తాం. మహా అయితే పైపైన రాళ్లను కూలీలతో తొలగించి, పరిమితమైన విస్తీర్ణంలోనే పంటను వేస్తాం. కానీ ఇప్పుడా బాధ లేదు. రాళ్ల నేలలను చక్కగా సాగుభూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి రాళ్లు ఏరించినా సాగుకు త్వరగా అనుకూలంగా మారని నేలను, ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇది ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ రైతుకు తట్టిన ఆలోచన. మధ్యప్రదేశ్‌లో ఆ మిషన్ని తయారు చేయగా వారి నుంచి కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అందుబాటులోకి తెచ్చారు.
భూమిని ఖాళీగా వదిలేయాల్సిన పని లేదు: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా వృథాగా ఉంది. దానికి కారణం భూమి మొత్తం రాళ్లతో నిండి ఉండటం. దానిని సాగులోకి తీసుకురావాలంటే ఈ రాళ్లను మనుషులతో ఏరిస్తుంటారు. దీనికి ఖర్చు కూడా ఎక్కువే. అంత ఖర్చు పెట్టినా అంతంత మాత్రంగానే రాళ్లను తొలగించగలరు. ఒకవేళా పంట వేస్తే మొక్కల వేర్లు భూమిలోపలికి చొచ్చుకొని పోకపోవడం వల్ల మొక్క ఎదుగుదల ఉండదు. అందువల్ల భూమి ఉన్నా, రాళ్లతో ఉండటం వల్ల చాలా మంది రైతులు ఆ నేలలను వృథాగా వదిలేస్తారు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవులను తలపిస్తాయి.
ఆలోచన కార్యరూపం దాలిస్తే ఇలానే మరి! : పశ్చిమ ప్రకాశం అయిన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండ ప్రాంతంలో ఇలాంటి రాళ్ల నేలలు అధికంగా కనిపిస్తాయి. ఈ సమస్యను స్వయంగా చూసిన కొమరోలుకు చెందిన రంగస్వామి, అతని సోదరుడు మల్లిఖార్జునరావులు రాళ్లు ఏరేందుకు ఏదైనా యంత్రం ఉందేమోనని పరిశోధించారు. చివరికి మధ్యప్రదేశ్‌లో దీన్ని తయారు చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లీ కావాల్సివ విధంగా యంత్రాన్ని తయారు చేయించి తెచ్చుకున్నారు.