తెలంగాణ

telangana

ETV Bharat / state

అంచనాలు తారుమారు - లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ సమాలోచనలు - analysis on cong defeat in tg - ANALYSIS ON CONG DEFEAT IN TG

Analysis on Congress Defeat in TG : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇక్కడి అధికార కాంగ్రెస్‌కు నిజంగానే సంతృప్తిని ఇచ్చాయా? పది నుంచి 14 స్థానాల వరకు సాధించవచ్చన్న అంచనాలు ఎందుకు తారుమారు అయ్యాయి. అభ్యర్ధుల ఎంపికలో లోపమా? నాయకులు సక్రమంగా పని చేయలేదా? లేదంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యూహాలు గాంధీభవన్‌కు అంతుచిక్కలేదా? బీజేపీతో పాటే ఎనిమిది, ఎనిమిది స్థానాలు పంచుకోవాల్సి రావడం కాంగ్రెస్‌ శ్రేణుల్ని నిరాశకు గురి చేసిందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం బీఆర్‌ఎస్‌ బీజేపీతో బేరసారాలు చేసుకుందని, కుట్ర కుతంత్రాల కారణంగానే పార్టీకి సీట్లు తగ్గాయని విశ్లేషించారు.

Telangana Lok Sabha Elections 2024 Overview
Analysis on Congress Defeat in TG (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 6:18 PM IST

Telangana Lok Sabha Elections 2024 Overview : తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌ రెడ్డి తమ పాలనకు రెఫరండంగా కూడా ప్రకటించారు. కనీసం 14 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు పని చేశాయి. కానీ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కసరత్తు మొదలైనప్పటి నుంచి కొందరు కాంగ్రెస్ నాయకులు పట్టీ పట్టనట్లు వ్యవహరించారన్నది కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న మాట.

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి - చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ - cm revanth phone call to cbn

అలా పార్టీ స్వయంకృతాపరాధంతో పాటు బీఆర్ఎస్‌ బీజేపీకి సహకరించడం వల్లనే శక్తిసామర్థ్యాలు, అవకాశాలు ఉన్నప్పటికీ 8 పార్లమెంటు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కొందరు మంత్రులు పార్టీ నాయకత్వంపై తీసుకొచ్చిన ఒత్తిళ్ల ప్రభావంతో డబుల్‌ డిజిట్‌ స్థానాలు దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ ఎత్తుగడలను సీఎం రేవంత్‌ దీటుగా తిప్పికొట్టడంతో ఈ 8 స్థానాల్లోనైనా గెలువగలిగామని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. స్థానిక రాజకీయ పరిణామాలు, ఆ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలు, ప్రజాభిమానం చూరగొన్న నాయకులను బరిలో దించడం అన్నవి కచ్చితంగా పాటించినప్పుడే, విజయానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదన్న భావన పార్టీలో ఉంది. ప్రధానంగా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన నేతలు లేకపోవడంతో ఇతరపార్టీల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకే తిరిగి టికెట్ ఇచ్చారు. నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌ నుంచి చల్లా వంశీచంద్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి డాక్టర్‌ మల్లు రవి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ, జహీరాబాద్‌ నుంచి సురేష్‌ శెట్కార్‌, నిజమాబాద్‌ నుంచి జీవన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి రాజేందర్‌రావు, అదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేశారు.

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ నుంచి, సునీతా మహేందర్‌ రెడ్డి మల్కాజిగిరి నుంచి, రంజిత్‌ రెడ్డి చేవెళ్ల నుంచి, కడియం కావ్య వరంగల్‌ నుంచి, బీఎస్పీ నుంచి వచ్చిన నీలం మధు మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా బరిలో దించారు. అయితే సికింద్రాబాద్‌, మల్కాజిగిరి అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందనే భావన ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కరీంనగర్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నియోజక వర్గాలకు అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది.

సికింద్రాబాద్‌లో ఢీలా.. ఇది కూడా ఓటమిపై కొంత ప్రభావం చూపిందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్‌ నుంచి బరిలో దించిన కాంగ్రెస్‌, ఆయన సామాజిక వర్గమైన మున్నూరు కాపులు సహా మైనారిటీలు, క్రైస్తవులు మద్దతు పొందవచ్చని భావించింది. కానీ టికెట్‌ కేటాయించిన తర్వాత ఎమ్మెల్యేగా ఉంటూ పోటీ చేయాలని దానం భావించగా, రాజీనామా చేయాల్సిందేనని ఏఐసీసీ సూచించింది.

ఈ అంశంపై కొన్ని రోజులు కాలయాపన జరిగింది. బీఫాం తీసుకునే వరకు పోటీ చేయాలా, వద్దా అన్న డైలమాలో ఉన్న దానం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్ధి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కావడం, తాము ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోవడం సికింద్రాబాద్‌లో ఓటమికి సగం కారణమని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మల్కాజిగిరిలో తారుమారు..ఇక మల్కాజిగిరి అభ్యర్ధిగా వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిని బరిలో దించింది కాంగ్రెస్‌. ఈమె ప్రత్యర్థి ఈటల రాజేందర్‌ రాష్ట్ర స్థాయిలో పేరున్న సీనియర్‌ కావడంతో దీటుగా ఎదర్కొనలేకపోయినట్లు తెలుస్తోంది. సీఎం సిట్టింగ్‌ స్థానం కావడంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా కాంగ్రెస్‌ చేసిన యత్నం విఫలమైంది. ఈమెను చేవెళ్ల నియోజక వర్గ అభ్యర్ధిగా నిలబెట్టి ఉంటే గెలుపు సునాయాసంగా ఉండేదని కూడా విశ్లేషిస్తున్నారు. చేవెళ్లలో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అభ్యర్థిగా తలపడ్డారు. ఇద్దరి మధ్య హోరాహోరిగా పోటీ జరిగి బీజేపీ వేవ్‌తో కాంగ్రెస్‌ ఓటమిపాలైంది.

మెదక్‌లో నిరాశ.. మెదక్‌ టిక్కెట్టును రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ పట్టుబట్టి నీలం మధుకు ఇప్పించారు. వాస్తవానికి ఆయనను అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకు మార్చి కాట శ్రీనివాస్‌ గౌడ్‌కు ఇచ్చారు. దీంతో మధు కాంగ్రెస్‌ను వదిలి బీఎస్పీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఓటమిపాలైన నీలం మధును తీసుకొచ్చి మెదక్‌ టికెట్‌ ఇచ్చారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ జరిగి కాంగ్రెస్‌ ఓడిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి.

పాలమూరులో ఎదురుదెబ్బ.. మహబూబ్‌నగర్‌ అభ్యర్ధిగా కాంగ్రెస్‌ చల్లా వంశీచంద్‌ రెడ్డిని బరిలో దించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి డీకే ఆరుణ సీనియర్‌ నాయకురాలు కావడం, వంశీచంద్‌రెడ్డి స్థానికంగా ఉండరని ప్రత్యర్థి వర్గం జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ స్థానంలో 12 సార్లు ప్రచారానికి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది.

వరంగల్‌ అభ్యర్ధి కడియం కావ్య, బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు కూడా చేశారు. ఉన్నఫలంగా ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో దించారు. ఇక్కడ కాంగ్రెస్‌ వ్యూహం ఫలించి విజయం సాధించారు. ఇక కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి విషయంలో స్థానిక మంత్రి ఒత్తిడితో ప్రవీణ్‌ రెడ్డికి కాకుండా రాజేందర్‌రావుకు టికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్‌ అభ్యర్థి బండి సంజయ్‌ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం, తమ అభ్యర్థి బలంగా లేకపోవడంతోనే ఇక్కడ కాంగ్రెస్‌ ఓటమిపాలైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇందూరులో బీజేపీ వేవ్‌.. ఇక నిజమాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా తిరిగి నిజామాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌కు స్థానికేతురుడు కావడం, అక్కడ సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఎత్తుగడలు, బీజేపీ వేవ్‌ పని చేయడం వంటి కారణాలతో కాంగ్రెస్‌ ఓటమిపాలైందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బీజేపీ నాయకులకు మద్దతుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా అటు ప్రధాని మోదీ, ఇటు హోం మంత్రి అమిత్‌ షాలు రోజు మార్చి రోజు ప్రచారానికి వచ్చారు. వీరు సున్నితమైన అంశాలు జనంలో తీసుకెళ్లి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం కూడా బలంగా వీటిని తిప్పికొట్టేందుకు తీవ్రంగా యత్నించింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ యత్నిస్తున్నట్లు ఆధారాలు చూపుతూ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈ విమర్శలపై దిల్లీలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ సామాజిక మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి కొందరిని అరెస్ట్ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అలా గట్టిగా పోరాడడంతోనే 8స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

రేవంత్​ రెడ్డిని కలిసిన కాంగ్రెస్​ ఎంపీలు - అభినందనలు తెలిపిన సీఎం - Congress MPs Meet Revanth Reddy

మహబూబ్​నగర్​లో ఎలా ఓడిపోయాం? సమీక్షించనున్న సీఎం రేవంత్​ - CM Revanth Review on Mahabubnagar MP Results

ABOUT THE AUTHOR

...view details