Reason for Increasing Sun Intensity : ఇంటి నుంచి అడుగు బయటపెడితే నిప్పుల వాన కురుస్తుందా అన్నట్లు భానుడి భగభగలు. కిలోమీటరు ప్రయాణం చేస్తే కళ్లు బైర్లు కమ్మేంత వేడి. సరే ఇంట్లో ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత, గాబరా. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్నా రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో ఇవీ ప్రజల కష్టాలు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఏప్రిల్ చివరి వారం నాటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. మే నెల రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే రాబోయే నెల రోజుల్లో రాష్ట్రం మరెంత నిప్పుల కొలిమిగా మారనుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండ సెగ మొదలైంది. ముఖ్యంగా రాజధాని సహా అనేక ప్రాంతాల్లో 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని ఈ ఉష్ణోగ్రతల ద్వారా సంకేతాలు అప్పుడే అందాయి. ఒక్క తెలంగాణ అనే కాదు, ఏపీ సహా దేశంలోని అనేక ప్రాంతాలు మే మాసానికి ముందే ఇలా మండిపోవడం ఆరంభించాయి.
అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి: భారత్‌లో మాత్రమే కాదు ప్రపంచం అంతా ఎండలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం భూతాపమే. మరి భూతాపం ఎందుకు పెరుగుతోందని ఆరా తీస్తే దానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల సమాధానం ఆగిపోయేది వాతావరణ మార్పుల వద్ద. భారత్ సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో దంచికొడుతున్న ఎండలు ఈ మార్పుల ఫలితమే. వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతలు మండిపోవడానికి మాత్రమే కాదు, అనేక ఇతర ప్రకృతి విపత్తులకు కూడా కారణం అవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు, వాతావరణం ఉన్నట్లుండి మారిపోయి కుంభవృష్టి వర్షాలు, వడగళ్లు, పిడుగుపాట్లు వంటివి వీటి ఫలితమే. అతివృష్టి, అనావృష్టి వంటి వాటికి కూడా ఇవే కారణం అవుతున్నాయి.
అయ్య బాబోయ్ ఎండలు - ఈ మంటలో ఎన్నికల విధులకు మేం రాలేం బాబు! - HEAT WAVE EFFECT ON ELECTION DUTY
ఎండ తీవ్రత పెరగడానికి కారణం ఇదే: పెరిగిన భూతాపం, వాతావరణ మార్పుల వల్ల 2023 సంవత్సరం లక్ష ఏళ్లలోనే అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. భూతాపానికి దారి తీస్తున్న కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల కేవలం ఎండలు దంచికొట్టడమే కాదు, ఇంకా అనేక ఇతర ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాలు కరిగి గాలి వీచే వేగం తగ్గిపోతోంది. 2100 నాటికి సగటు వార్షిక గాలి వీచే వేగం 10 శాతం మేర తగ్గిపోవచ్చని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐపీసీసీ అంచనా వేసింది. ధ్రువాల్లో మంచు వేగంగా కరిగిపోతున్నందున గాలి వీచే వేగం మరింత పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. 1979 నుంచి ఆర్కిటిక్ మిగతా ప్రపంచం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతోందని ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్ర పత్రిక నేచర్ కథనం వెల్లడించింది.
Earth Temperature Increase Yearly : గాలి వేగం మందగించడం వల్ల విమానాలు, నౌకలు సరిగా కదలలేకపోతాయి. పవన విద్యుదుత్పత్తి 10 నుంచి 20 శాతం మేర తగ్గిపోతుంది. అంటే వాతావరణ మార్పులకు పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గిపోతుంది. హిమాలయ, మంచు రుతుపవనాల మీద ఆధారపడిన భారత్ వంటి దేశానికి ముప్పు మరింత ఎక్కువగా ఉంది. భారత్‌కు 70 శాతం వార్షిక వర్షపాతం రుతుపవనాల ద్వారానే లభిస్తోంది. దేశంలోని వంద జలాశయాలకు రుతుపవనాలు తెచ్చే వర్షపాతమే దిక్కు. భూతాపం ఇలాగే పెరిగిపోతే హిమాలయాలు కరగడం కూడా తీవ్రతరం అవుతుంది. అందువల్ల అతివృష్టి, అనావృష్టి ముప్పు మరింత పెరుగుతుంది. ఇలాంటి ముప్పులను భారత్ ఇప్పటికే అనుభవిస్తోంది. అధిక ఎండలు, వర్షభావం లేకుంటే కుండపోత, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో ముఖ్యంగా పంటలకు ప్రతి ఏటా తీవ్ర నష్టం కల్గుతోంది. ప్రతి ఏటా ఆహారం సహా మామిడి వంటి పంటలకు ఇలాంటి పరిస్థితులతో తలెత్తుతున్న నష్టం అంతా ఇంతా ఉండడం లేదు. ఇవే పరిస్థితులు తలెత్తితే ఆహార భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.