Police Solved Shadnagar Realtor Murder Case :గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్న కుమారుడే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లా కమ్మదనంలో ఈ నెల 10వ తేదీన జరిగిన కమ్మరి కృష్ణ హత్య కేసును షాద్‌నగర్ పోలీసులు ఛేదించారు. షాద్‌నగర్ పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ హత్య వివరాలు వెల్లడించారు.
రియల్టర్ కమ్మరి కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడో భార్య అయిన కమ్మరి పావని పేరుతో కృష్ణ ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం మూడో భార్యకే రాసేస్తాడనే కోపంతోనే మొదటి భార్య కుమారుడైన కమ్మరి శివ తన తండ్రిని హత్య చేయించినట్లు వివరించారు. దీనికోసం రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ ముగ్గురితో హత్య చేయించినట్లు పేర్కొన్నారు.
"శంషాబాద్ ఠాణా పరిధి హైదర్షాకోటలో నివసిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ ఇటీవల హత్యకు గురయ్యాడు. కాగా ఆయనకు ముగ్గురు భార్యలు. కృష్ణ మూడో భార్య పావని పేరిట కొంత ఆస్తి రిజిస్ట్రేషన్ చేయడంతో తన మొదటి భార్య కుమారుడు శివ అడ్డు చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో విబేధాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే తన తండ్రి కమ్మరి కృష్ణను హత్య చేయాలనుకున్నాడు శివ. అందుకు పథకం పన్నాడు. తన తండ్రి వద్ద బాడీగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న బాబా శివానంద్‌కు, తండ్రిని హత్య చేసేందుకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు."- రాజేశ్, శంషాబాద్ జోన్ డీసీపీ