Land Mafia Occupy Ponds in Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా? ప్రైవేట్‌దా? అనే తేడా లేకుండా కబ్జా చేసే దందా సాగుతోంది. ఇంటి స్థలం కోసం ఆశపడే సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కోట్ల రూపాయలు గడించే వ్యాపారం సాగుతోంది.
ఆదిలాబాద్, బోథ్ పట్టణాలలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతుంది. కొందరు ప్రముఖ నేతలు, అధికారులు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి ప్రభుత్వ స్థలాలను కాజేసే ప్రయత్నం జరుగుతోంది. ఆదిలాబాద్‌లోని 342 సర్వే నంబర్లోని కృష్ణానగర్ చెరువుని ఆనుకొని ఉన్న భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికే సర్వే నంబర్ 346లోని 87 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో ప్రభుత్వ స్థలమేదో? ప్రైవేటు స్థలమేదో తెలియకుండా పోతోంది.
ఇంటి స్థలం కొనుక్కోవాలనుకునే సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల ఆదాయవనరుగా మారుతోంది. బోథ్ పట్టణంలోని సాయినగర్ నుంచి వెళ్లే ఖరత్వాడా ప్రాజెక్టు కాలువ సహా అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకొని ఉన్న కల్వర్టును కాజేసిన ఘటనలో ఓ అధికారి పాత్ర ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు.
ఆదిలాబాద్ పట్టణంతోపాటు బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, ఉట్నూర్‌లో అక్రమ లేఅవుట్ల దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. రాత్రికి రాత్రే కాగితాలు తారుమారు చేసినట్లు, భూములను తారుమారు చేసే వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటానికి అడ్డు వచ్చే నిబంధనలు వ్యాపారులు చేసే అక్రమ దందాకు ఎందుకు అడ్డు రావడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న దందా బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికార యంత్రాంగం ముందస్తుగా నియంత్రించకపోవటమే ప్రధాన సమస్యగా మారుతోంది.
"ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని సమాచారం వచ్చింది. ఇలాంటి ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఉన్నాయి. త్వరలోనే తాము పట్టణంలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయో వాటిపై సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అలాంటి ఆక్రమణలను కూల్చివేస్తాం. లే అవుట్ల అవి మున్సిపల్ అర్బన్ వాళ్లకు సంబంధించినవి. వాటి గురించి వారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం." - శ్రీనివాస్, తహసీల్దార్
Land Mafia: పాలమూరులో రెచ్చిపోతున్న భూ మాఫియా
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై రీసర్వే చేశాకే 'బుల్డోజర్' - వ్యూహం మార్చుకున్న హైడ్రా - HYDRA resurvey FTL and buffer zones