Property purchase In Hyderabad: విజయవాడ జాతీయ రహదారిపై నగరానికి ముఖ ద్వారంగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం దశాబ్ద కాలంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. పాత, కొత్త కలిపి దాదాపు 600 కాలనీలు ఉన్నాయి. దీంతో శివారు ప్రాంతం అనూహ్య స్థాయిలో విస్తరించి రూపురేఖలే మారిపోయాయి. నివాసానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నాగోల్, ఎల్బీనగర్ నుంచి మెట్రో సదుపాయంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉండటంతో కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు పెరిగాయి.
బహుళ అంతస్తుల భవనాలు: గతంలో కాలనీల్లో ఎక్కువ మొత్తంలో స్థలాలు ఉండేవి. గజం ధర రూ.20 వేల నుంచి రూ.40 వేలు పలికేవి. ఆ సమయంలో చాలా మంది ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో శివారు కాలనీల్లోనూ గజం రూ.40 వేలకు పైనే ఉంది. ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం మధ్య తరగతికి భారంగా మారింది.
దీంతో 300 గజాల కంటే ఎక్కువగా స్థలం ఉంటే దానిని బిల్డర్లు బహుళ అంతస్తుల భవనంగా నిర్మించి ఫ్లాట్‌లను అమ్ముతున్నారు. వీటి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటాయి. శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోనైతే 1000 చదరపు అడుగుల ఫ్లాటు రూ.45 లక్షల వరకు వస్తుంది. ప్రజలు శివారు కాలనీల్లో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.