ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్యుతాపురం సెజ్​ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌ - 17 మంది మృతి - Reactor Blast in Pharma Company

Reactor Blast in Achyutapuram SEZ: కాసేపట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోదామని హడావుడిలో ఉన్న సి‌బ్బందిపై మృత్యువు ఒక్కసారిగా వచ్చి మీదపడింది. ఉహించని పరిణామంతో ఉలిక్కిపడిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పేలుడు ధాటికి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. మంటల్లో కాలిన శరీరాలు, ముక్కలుగా ఎగిరిపడిన మాంసపు ముద్దలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇప్పటివరకూ 17 మంది మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి.

Reactor Blast in Pharma Company at Anakapalle
Reactor Blast in Pharma Company at Anakapalle (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 4:27 PM IST

Updated : Aug 21, 2024, 9:38 PM IST

Reactor Blast in Pharma Company at Achyutapuram :అనకాపల్లి జి‌ల్లా అచ్యుతాపురం సెజ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి, అంతటా అంటుకుని పేలుడు సంభవించింది. దీంతో గోడలు, ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు.

శరీర భాగాలు చిధ్రమయ్యాయి. ఓ మహిళా కార్మికురాలి పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది పొక్లెయిన్‌తో శిథిలాల కిందనుంచి మృతదేహాలను వెలికితీయాల్సి వచ్చింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరుమున్నీరుగా రోదించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను తరలించారు. కార్మికులు షిప్ట్‌ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

"సాల్వెంట్ లీకై అది ఎలక్ట్రికల్ పానెల్​ మీద పడి ఫ్లాష్ అవడం వలన ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ తాకిడికి గోడలు కూలిపోయాయి. దీని కారణంగా భారీ ప్రమాదం జరిగింది. అంతస్తులు ఏం కూలిపోలేదు". - ప్రత్యక్ష సాక్షి

ఘటనా స్థలిలో సహాయక చర్యలు :తక్షణం కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపు చేయడంతోపాటు మూడో అంతస్తులో ఉన్న 33 మంది కార్మికులను జెయింట్‌ ఫైర్‌ ఫైటర్‌ క్రేన్ సాయంతో కాపాడారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది.

తమవారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్దసంఖ్యలో కంపెనీవద్దకు చేరుకున్నారు. గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి, విశాఖలోని ఉషప్రైమ్ ఆస్పత్రి, కేజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. సంఘటన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతోపాటు స్థానిక ఎమ్మెల్యే కొణాతాల రామకృష్ణ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ప్రమాదం ఏవిధంగా జరిగిందో హోంమంత్రి అనిత వివరించారు. సంస్థ ప్రతినిధులెవ్వరూ స్పందించలేదని, ఉన్నతస్థాయి విచారణ అనంతరం బాధ్యతులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. రియాక్టర్ పేలలేదని, సాల్వెంట్‌ లీకు వల్లే పేలుడు జరిగిందని వివరించారు.

మృతుల వివరాలు: ప్రమాదం ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. వెంకుజీపాలెంకు చెందిన కంపెనీ ఏజీఎం నీలాపు రామిరెడ్డితోపాటు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస, అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి కూడా చనిపోయారు. నారాయణరావు మహంతిది విజయనగరం జిల్లా గరివిడి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొరపాటి గణేశ్‌, కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజినీర్ చెల్లపల్లి హారిక, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ పైడి రాజశేఖర్‌, కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మారిశెట్టి సతీశ్‌ చనిపోయారు.

కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అసిస్టెంట్‌ మేనేజర్ మొండి నాగబాబు, విశాఖలోని కూర్మన్నపాలెంకు చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు ప్రమాదంలో కన్నుమూశారు. హౌస్‌కీపింగ్ బాయ్స్‌ వేగి సన్యాసినాయుడు, పూడి మోహన్‌ దుర్గాప్రసాద్, దిబ్బపాలెం సెజ్‌కాలనీకి చెందిన పెయింటర్ ఎలబల్లి చిన్నారావు, పార్వతీపురానికి చెందిన ఫిట్టర్ పార్థసారథి చనిపోయారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ బమ్మిడి ఆనందరావు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకుచెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రతోపాటు ఎస్‌.రాయవరానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంకటసాయి, ఫిట్టర్ జై చిరంజీవి సైతం ఈ ప్రమాదంలోనే కన్నుమూశారు.

పేలుడుపై ప్రధాని దిగ్భ్రాంతి: అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో పేలుడుపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం : అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రియాక్టర్‌ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ అన్నారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకమేర్పడిందని తెలిపారు.

చంద్రబాబు పరామర్శ : నేడు అచ్యుతాపురానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఫార్మా కంపెనీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించనున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి, ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఘటనపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది :ఈ ఘటనపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్‌ పేలి పలువురు కార్మికులు మృతిచెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం - బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు - CM CBN on Pharma Company Incident

Last Updated : Aug 21, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details