Crops Damage in Telangana : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకింత చిన్నచూపని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు ముంచెత్తినా సీఎం కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఎన్నికల గోల తప్ప, పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇబ్బంది పెడుతోందని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
"పంట నష్టం అంచనాల సాకుతో ఆలస్యం చేయకుండా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది".- నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి
BRS Demands Compensation to Farmers :నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాగ్ధార్‌పల్లి గ్రామంలో ఎండిన పొలాలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన(Crops Damage) రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పొలాలను పరిశీలించి, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టవు : హరీశ్ రావు
Govt Reacts on Crops Damage :అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అదైర్య పడొద్దని, ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలతో పంటనష్టం జరిగిందని తెలిపారు. కామారెడ్డిలో అత్యధికంగా నష్టపోయారని తెలిపారు. పంటనష్టం అంచనావేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) సీఎస్, వ్యవసాయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారని చిన్నారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సిబ్బంది వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.